Share News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:20 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
Vizag Steel Plant Accident

విశాఖపట్నం, జూన్8 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్(SMS)-2లో మోల్టెన్ మెటల్(ద్రవ లోహం) తరలిస్తున్న ల్యాడల్‌కు సంబంధించిన బకెట్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.


సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు.


మెరుగైన వైద్యం అందించాలి: హోంమంత్రి అనిత

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఈ ప్రమాదంపై వెంటనే స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం పర్యటనలో ఉన్నప్పటికీ, ప్రమాద సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి హోంమంత్రి బయలుదేరారు.


విచారణకు ఆదేశాలు

ప్రమాదం ఎలా జరిగింది?, భద్రతా ప్రమాణాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా?, సాంకేతిక కారణాల వల్లే ప్రమాదం సంభవించిందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు అధికారిక నివేదిక వెలువడిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

Updated Date - Jun 08 , 2026 | 06:48 PM