కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పిడకల సమరం.. దీని ప్రత్యేకత తెలుసా.?
ABN , Publish Date - Mar 20 , 2026 | 07:40 PM
కర్నూలు జిల్లాలోని కైరుప్పల గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ నిర్వహించే వీరభద్రస్వామి - కాళికాదేవి వివాహ మహోత్సవం సందర్భంగా జరిగే ‘పిడకల సమరం’ ఈరోజు అత్యంత హోరాహోరీగా సాగింది.
కర్నూలు జిల్లా, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం సంప్రదాయ ఉత్సవాలకు ప్రసిద్ధి. ఇక్కడ జరిగే పిడకల సమరం గ్రామ పండుగల్లో అత్యంత ఉత్సాహభరితంగా ఉండే కార్యక్రమాల్లో ఒకటి. ఆధునిక కాలంలో కూడా తమ పూర్వీకుల నాటి ఆచారాలను గౌరవిస్తూ, కైరుప్పల గ్రామస్థులు ఈ పిడకల సమరాన్ని ఏటా నిర్వహించడం విశేషం. కైరుప్పల గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జరిగే ప్రసిద్ధ ‘పిడకల సమరం’ ఈరోజు(శుక్రవారం) అత్యంత ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది.
36 మందికి గాయాలు.. అయినా తగ్గని ఉత్సాహం..
ఈ ఏడాది జరిగిన పిడకల సమరంలో వీరభద్రస్వామి - కాళికాదేవికి సంబంధించిన ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. ఈ పోరులో సుమారు 36 మందికి నుగ్గులు(పిడకల ముక్కలు) తగిలి చిన్నపాటి గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆ గ్రామంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఈ వేడుక అత్యంత ప్రశాంతంగా ముగిసింది. ఈ వింత సంబరాన్ని చూసేందుకు కర్నూలు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దెబ్బలు తగిలినా అది స్వామివారి ఆశీస్సుగా భావిస్తారు.
భారీగా తరలి వచ్చిన భక్తులు..
వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. కైరుప్పలలో శుక్రవారం సాయంత్రం పిడకల సమరం జరిగింది. ఈ సమరం కోసం పిడకలను సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో రాశులుగా పిడకలను ఉంచారు. మండలంలోని అస్పరి, కారుమంచి, బిల్లేకల్లు, చిన్నపల్లి, పుష్పాలదొడ్డి, యాటకల్లు, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తకూరు గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
భద్రతా ఏర్పాట్లు..
ఈ పోరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పోరాటం కేవలం సంప్రదాయంలో భాగంగానే జరుగుతుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ కలిసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సమరంలో భక్తులు తమ కోర్కెలను నెరవేర్చుకోవడం, వీరభద్ర స్వామికి పిడకలను సమర్పించడంలో భాగంగా ఆనవాయితీగా పాల్గొన్నారు.
చరిత్ర, పురాణాల నేపథ్యం..
పురాణాల ప్రకారం.. వీరభద్రస్వామి, కాళికాదేవి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలుసుకున్న కాళికాదేవి అనుచరులు(యాదవ, కురుబ తదితర వర్గాలు).. వీరభద్రస్వామి అనుచరులను(లింగాయత్ వర్గం) అడ్డుకుంటారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పిడకలతో యుద్ధం జరుగుతుంది. చివరకు వారు రాజీపడి స్వామివారి కల్యాణం జరిపిస్తారు. ఈ పురాణ ఘట్టాన్ని స్మరిస్తూ ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News