Share News

కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:49 PM

కర్నూలు ఎయిర్‌పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కావడం సంతోషకరమని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు విమానాశ్రయం నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసి, తక్కువ వ్యవధిలోనే దానిని ప్రారంభించామని పేర్కొన్నారు.

కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Kurnool Aviation Training Centre

కర్నూలు జిల్లా, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ఎయిర్‌పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కావడం సంతోషకరమని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) వ్యాఖ్యానించారు. కర్నూలు విమానాశ్రయం నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసి, తక్కువ వ్యవధిలోనే దానిని ప్రారంభించామని పేర్కొన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఈరోజు (శనివారం) ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ సిరి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కేఈ శ్యామ్ బాబు , ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఆనంద్ జాకబ్ వర్గీస్ పాల్గొన్నారు.


ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తాం: మంత్రి జనార్దన్ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఇదే విమానాశ్రయంలో ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కావడం అభినందనీయమని తెలిపారు. ఏవియేషన్‌ రంగంలో భవిష్యత్తులో నిపుణులైన సిబ్బందికి, పైలట్లకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులతో పాటు కర్నూలు జిల్లా యువతకు కూడా విమానయాన రంగంలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తామని, తొలి దశలో 180 ఎకరాల్లో, రెండో దశలో 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


యువతకు పైలట్ శిక్షణ అవకాశాలు వస్తాయి: మంత్రి టీజీ భరత్

tg bharath.jpg

కర్నూలులో ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని ఏపీ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. కర్నూలు, అనంతపురం ప్రజలు ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పైలట్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించారు. కర్నూలు విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. కర్నూలు విమానాశ్రయంలో రన్‌వే పొడవు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. డీజీసీఏ రీజినల్ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సూచించారు. విమానయాన రంగంలో రాయలసీమ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు.


పైలట్ శిక్షణ అవకాశాలు వస్తాయి..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని మంత్రి టీజీ భరత్ ఉద్ఘాటించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విమానయాన మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రాష్ట్రంతో పాటు పొరుగు ప్రాంతాల యువతకు పైలట్ శిక్షణ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పైలట్లకు వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నాయని అన్నారు. కర్నూలు విమానాశ్రయం నుంచి తొలి శిక్షణ విమానాన్ని ఫ్లాగాఫ్ చేసినట్లు తెలిపారు. కర్నూలులో ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన శిక్షణ రంగానికి మరింత ఊతమిస్తోందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


యువతకు కర్నూలులోనే పైలట్ శిక్షణ పొందే అవకాశం: గౌరు చరితారెడ్డి

కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చరిత్రాత్మకమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. పైలట్ కావాలనే కల ఉన్న యువతకు కర్నూలులోనే శిక్షణ పొందే అవకాశం వచ్చిందని తెలిపారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పైలట్లకు డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అకాడమీలో సుమారు 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పైలట్లతో పాటు టెక్నికల్, మేనేజ్‌మెంట్ విభాగాల్లోనూ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో నైట్ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. మరిన్ని విమాన సర్వీసులు ప్రవేశపెట్టి.. రోజువారీ ఫ్రీక్వెన్సీ పెంచి మరిన్ని విమానాలు నడపాలని గౌరు చరితారెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: పెమ్మసాని

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్

పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 02:05 PM