మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: పెమ్మసాని
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:19 PM
మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandra Sekhar) వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మహిళల ఉత్పత్తులకు ఆర్థిక సహకారం, మార్కెట్ లింకేజీ కల్పించడంపై దృష్టిసారించామని వెల్లడించారు. విజయవాడలో తొలిసారిగా నేషనల్ సరస్ ఈవెంట్ జరుగుతోందని.. ఈ కార్యక్రమం నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఏర్పాట్లను పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు (శుక్రవారం) పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.
ఈ ఈవెంట్లో 350 స్టాల్స్ ఏర్పాటు..
ఢిల్లీ నుంచి విజయవాడకు నేషనల్ సరస్ ఈవెంట్ తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని పెమ్మసాని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్, మార్కెట్ యాక్సెస్ కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. ఇంటి వద్ద ఉత్పత్తులు తయారు చేస్తున్న మహిళలకు సరస్ ద్వారా మంచి మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 350 స్టాల్స్ ఈ ఈవెంట్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 250 స్టాల్స్‌తో మహిళా పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల మహిళల ఉత్పత్తులు, విజయగాథలకు ఈ ఈవెంట్ ఓ వేదిక కాబోతుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన విజయగాథలపై లెర్నింగ్ సెంటర్‌గా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక బ్రాండ్‌గా ‘స్వయం ఏపీ’ ప్రతిపాదనలు చేశాం..
మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే అవకాశాలు ఈ ఈవెంట్‌లో ఉన్నాయని పెమ్మసాని అన్నారు. దసరా ఉత్సవాల సమయంలో నేషనల్ సరస్ ఈవెంట్ నిర్వహణతో విజయవాడకు మరింత ఆకర్షణగా మారిందని చెప్పారు. నేషనల్ సరస్ ఈవెంట్ ఏర్పాట్లపై తొలి సమీక్ష సమావేశం నిర్వహించామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాట్లపై విస్తృతంగా సమీక్షించామని చెప్పారు. సందర్శకుల సౌకర్యాలు, భద్రత, పార్కింగ్, స్టాల్స్ నిర్వహణపై అధికారులతో చర్చించామని అన్నారు. ఏపీ మహిళల ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్‌గా ‘స్వయం ఏపీ’ ప్రతిపాదనలు చేశామని వెల్లడించారు.
నాణ్యమైన ఉత్పత్తులకు సహకారం అందిస్తాం..
‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పెమ్మసాని ఉద్గాటించారు. నాణ్యమైన ఉత్పత్తులకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లో సహకారం అందిస్తామని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతతో కుటుంబ ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. విజయవాడలో దసరా పండగతో పాటు నేషనల్ సరస్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ సరస్‌లో కొత్త మార్కెట్లు కల్పించవచ్చని అన్నారు. వినియోగదారులకు విభిన్న ఉత్పత్తులు అందించేలా ఈ సరస్ ఓ వేదిక కాబోతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు
వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల రాజీనామా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News