ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:55 AM
ధాన్యం సేకరణ కేవలం వ్యాపార లావాదేవీ కాదని.. రైతులకు న్యాయం చేసే పవిత్ర బాధ్యత అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
విజయవాడ, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణ కేవలం వ్యాపార లావాదేవీ కాదని.. రైతులకు న్యాయం చేసే పవిత్ర బాధ్యత అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) వ్యాఖ్యానించారు. కల్లాల వద్ద నుంచే ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని ఆదేశించారు. విజయవాడలో ఈరోజు (శుక్రవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాపులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. గన్నీ బ్యాగుల లభ్యతపై కచ్చితమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే హెచ్‌డీపీఈ బ్యాగులను వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ధాన్యం రవాణాకు 31వేల వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
అత్యాధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం..
గుజరాత్ తరహాలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రతికూల వాతావరణం, సమస్యలను మూడు రోజుల ముందే అంచనా వేసి నివేదించాలని ఆదేశించారు. గత ఖరీఫ్‌లో 92శాతానికిపైగా రైతు ఖాతాల్లో నగదు వేశామని తెలిపారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ఈసారి అంచనా వేశామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం 2619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 6.1 కోట్ల ధాన్యం గన్నీ బ్యాగ్‌లను సిద్ధం చేశామని చెప్పారు. ఈ సంవత్సరం రవాణా ఖర్చులను కూడా రైతుల ఖాతాలో వేస్తామని తెలిపారు. 1.1 కోట్లకు అంచనాలు ఈసారి ఉన్నాయని.. ఇంకా మారితే మారవచ్చని చెప్పారు. రైతును రాజుగా భావించి తాము పని చేస్తామని వెల్లడించారు.
రైతన్నల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి..
కళ్లాల దగ్గర నుంచే ధాన్యాన్ని సేకరించి, నచ్చిన మిల్లులకే అన్నదాతలు తీసుకెళ్లవచ్చని మంత్రి అన్నారు. 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు, జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక అధికారులతో కాల్ సెంటర్లను నిర్వహించాలని సూచించారు. రైతన్నల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి దాదాపు 7 లక్షల మంది రైతులకు నేరుగా మేలు చేశామని వెల్లడించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కూడా ఏ ఒక్క రైతు నిరాశ చెందకుండా చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. కళ్లాల్లో ధాన్యం పెట్టుకుని అన్నదాతలు ఎదురుచూసే పరిస్థితి రాకుండా చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు
వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల రాజీనామా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News