ధాన్యం సేకరణలో అక్రమాలకు కేంద్రం చెక్‌!

ABN , First Publish Date - 2023-09-16T04:29:19+05:30 IST

ధాన్యం సేకరణలో మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ధాన్యం సేకరణ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రైతు భరోసా కేంద్రాలు, ఇతర

ధాన్యం సేకరణలో అక్రమాలకు కేంద్రం చెక్‌!

ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌

రైసు మిల్లుల విద్యుత్తు వినియోగంపైనా నిఘా

ఖరీఫ్‌ నుంచి బయోమెట్రిక్‌ ఆధారిత సేకరణ

నిబంధనలు కఠిన తరం చేసిన కేంద్ర సర్కారు

యూపీ మోడల్‌ను అనుసరించాలని ఆదేశాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ధాన్యం సేకరణలో మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ధాన్యం సేకరణ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రైతు భరోసా కేంద్రాలు, ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా ధాన్యం విక్రయించే ప్రతి రైతు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు బయోమెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆర్బీకేల నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసే వాహనాలకు, తర్వాత సీఎంఆర్‌ రైస్‌ను సివిల్‌ సప్లయిస్‌, ఎఫ్‌సీఐలకు చెందిన బఫర్‌ గొడౌన్లకు తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీఎంఆర్‌ రైస్‌ను అందిస్తున్న మిల్లుల విద్యుత్తు వినియోగాన్ని ప్రతి నెలా నిశితంగా పరిశీలించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఈ బయోమెట్రిక్‌ ఆధారిత ధాన్యం సేకరణ విధానం సత్ఫలితాలనిస్తుండటంతో అదే పద్ధతిని ఏపీలోనూ అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.

అక్రమాలు ఆగేనా?

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించే పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు, ఆర్బీకేల సిబ్బంది అధికార వైసీపీ నాయకులు, మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం సేకరణ విధానానికి తూట్లు పొడుస్తున్నారు. ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో జరిగిన అక్రమాలే ఇందుకు నిదర్శనం. అకాల వర్షాలు ముంచెత్తడంతో రబీ ధాన్యం కల్లాల్లోనే తడిసిపోయింది. ఈ ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అల్టిమేటం ఇవ్వడంతో ప్రభుత్వం.. ఆఫ్‌లైన్‌లోనే ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చేసింది. తరలించిన ధాన్యానికి మిల్లర్లు బి-రిజిష్టర్లలో వివరాలు నమోదు చేసుకుని, రైతులకు చెల్లింపులు చేసేలా వెసులుబాటు కల్పించింది. ఇదే అవకాశంగా మిల్లర్లు, అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా దోపిడీకి తెరతీశారు. తడిసిపోయిన ఽధాన్యాన్ని ఆఘమేఘాలపై అధికార పార్టీకి చెందిన వారి మిల్లులకు తరలించేశారు. ఇలా తరలించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా తడిసిపోయిందనే సాకుతో అడ్డంగా కోసేశారు. బస్తాకు రూ.1530 మద్దతు ధర చెల్లించాల్సి ఉండగా.. ధాన్యంలో తేమ, నూక శాతం ఎక్కువగా ఉందంటూ రూ.1300 మాత్రమే చెల్లించారు. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు గగ్గోలు పెట్టారు. మరోవైపు సీఎంఆర్‌ కోసం సేకరించిన ధాన్యాన్ని అన్ని రైసు మిల్లులకు ర్యాండమ్‌గా తరలించాల్సి ఉండగా.. అధికార పార్టీకి చెందినవారి రైసు మిల్లులకే ఎక్కువగా తరలించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైసుమిల్లుల కరెంటు బిల్లులతో అనుసంధానం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి బయోమెట్రిక్‌ ఆధారిత ధాన్యం సేకరణ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

రబీ సాగు కార్యాచరణకు సన్నద్ధం

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023-24 రబీ పంటల సాగుపై కార్యాచరణ ప్రణాళిక తయారీకి వ్యవసాయ శాఖ సన్నద్ధమౌతోంది. రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా ప్రణాళిక రూపకల్పనపై శుక్రవారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. రైతులకు జిప్సం, జింక్‌ సల్ఫేట్‌, సూక్ష్మపోషకాలు, నీటిలో కరిగే ఎరువుల సరఫరాకు ఏపీ సీడ్స్‌ను నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీకే పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను వచ్చే నెల 15లోపు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ హరికిరణ్‌ సూచించారు.

Updated Date - 2023-09-16T04:29:19+05:30 IST