పోలీసుల ఆపరేషన్.. డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..
ABN , Publish Date - Mar 07 , 2026 | 07:30 AM
విజయవాడ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలో ఇటీవల డ్రగ్స్ (Vijayawada Drugs Case) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 16 గ్రాముల ఎమ్‌డీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల నిఘా..
పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన కౌశిక్‌రెడ్డి, పెనమలూరు యనమల కుదురుకు చెందిన దండు అచ్యుత్, విజయవాడ సున్నపుబట్టిల సెంటర్‌కు చెందిన సాయి హేమంత్, పెనమలూరు తాడిగడపకు చెందిన అద్దేపల్లి సాయి వివేక్ డ్రగ్స్ విక్రయాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి సుమారు 16 గ్రాముల ఎమ్‌డీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాచవరం పోలీసులకు అప్పగించారు. అనంతరం వారిని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి..
పోలీసుల ప్రాథమిక విచారణలో బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తెచ్చి విజయవాడలో యువతకు విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఈ డ్రగ్స్ సరఫరా వెనుక మరికొందరు ఉన్నారేమో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతకు పోలీసులు పలు సూచనలు చేశారు. డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు
జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలి: పవన్ కల్యాణ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News