ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:06 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గాయత్రీ దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారిని లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు.
విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు (సోమవారం) గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. దసరా శరన్నవరాత్రుల్లో నిన్న (ఆదివారం) మొదటి రోజు అమ్మవారిని లక్షమంది భక్తులు దర్శించుకున్నారు.
సకల వేద స్వరూపంగా గాయత్రీదేవిని కొలుస్తారు..
సకల వేద స్వరూపంగా గాయత్రీదేవిని కొలుస్తారని పండితులు తెలిపారు. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత అని చెప్పుకొచ్చారు. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తున్నారని వెల్లడించారు. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని వివరించారు. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందని అన్నారు. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా కొలిచారని చెప్పారు. ప్రాత:కాలంలో గాయత్రీగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతీగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలను అందుకుంటుందని తెలిపారు. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయని పురోహితులు పేర్కొన్నారు.
శ్రీశైలంలో బ్రహ్మచారిణి అలంకరణలో భ్రమరాంబాదేవి..
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు (సోమవారం) రాత్రికి మయూర వాహనంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆ తర్వాత శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి ప్రమాదం
యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News