జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి.. కేంద్ర ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:59 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జగన్, ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అమరావతి, అక్టోబర్ 30: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జగన్, ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నైతిక విలువలు లేని రాజకీయ పార్టీకి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదని.. అసాంఘీక శక్తులకు అడ్డా అని అన్నారు. దీనికి ముఠా నాయకుడు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యహితంగా ప్రజలకు సమన్యాయం అందించేందుకు రాజకీయ పార్టీ పెడతారు తప్ప.. జగన్ లాగా స్వార్థ రాజకీయల కోసం కాదని అన్నారు.
‘రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, నేను పులివెందుల వస్తా ఎన్నికలప్పుడు చేతులు మడుస్తా అంటే.. అరాచకం చేస్తాననేనా జగన్? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో చేతులు మడుస్తానని అటు ప్రజలను ఇటు పోలీసులను భయభ్రాంతులను చేయడం తగునా జగన్. మీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎందుకు రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు పరారయ్యాడో సమాధానం చెప్పగలరా జగన్? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం, కల్తీ మద్యం సరఫరా, స్వామి వారి లడ్డూ కల్తీ వీటన్నింటిలో అరెస్ట్ అయినా మీ దగ్గర పనిచేసిన నాయకులను చూసి కూడా మీది రాజకీయ పార్టీ అని ధైర్యంగా చెప్తారా జగన్’ అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా పోలీసులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేశారని.. వాటికి ఏం సమాధానం చెబుతారంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లి, చెల్లిని నిర్లక్ష్యం చేసి రోడ్డునపడేసిన జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ఎమ్మెల్సీ నిలదీశారు. జగన్, అతని పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును, వారి వ్యాఖ్యల వీడియోలు తెప్పించుకుని ప్రెస్ క్లిప్పింగ్స్ చూసి.. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎమ్మెల్సీ వర్ల రామయ్య కోరారు.
ఇవి కూడా చదవండి..
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో
Read Latest AP News And Telugu News