రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:26 AM
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. అమెరికాలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
అమరావతి, అక్టోబర్ 30: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. అమెరికాలో ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలసుబ్రహ్మణ్యం.. అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ ఈఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్పీగా కూడా బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలసుబ్రమణ్యం మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు. నిజాయితీ, అంకితభావం, గట్టి నిర్ణయాలు తీసుకోగల సమర్థవంతమైన అధికారిగా బాలసుబ్రమణ్యం గుర్తింపు పొందారన్నారు. పోలీస్, ఇంటెలిజెన్స్, రవాణా, ప్రజా పాలన విభాగాల్లో ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. పాలనలో నూతన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ధైర్యంగా పోరాడి బాలసుబ్రమణ్యం కన్నుమూశారని, ఆయన అందించిన సేవలు పోలీస్ రంగానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
బాలసుబ్రహ్మణ్యం సేవలు చిరస్మరణీయం: మంత్రి లోకేశ్
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ వైస్ చైర్మెన్ అండ్ ఎండీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. బాలసుబ్రహ్మణ్యం అమెరికాలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయని.. వారి స్మృతిలో నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వర్తించి ముక్కుసూటి మనిషిగా పేరుపొందిన బాలసుబ్రహ్మణ్యం సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు
కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్.. భయాందోళనలో మాచవరం గ్రామస్తులు
Read Latest AP News And Telugu News