ఈరోజు రాత్రి వరకు 100 శాతం విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యం: అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:04 PM
అమలాపురంలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇంత భారీ తుఫాన్ వచ్చినప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగామన్నారు.
అంబేద్కర్ కోనసీమ, అక్టోబర్ 30: అమలాపురంలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇంత భారీ తుఫాన్ వచ్చినప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లకుండా అడ్డుకోగలిగామని తెలిపారు. తుఫాన్ వస్తుందని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే పనిలో ఉన్నారని.. అందువల్లే ప్రాణ, ఆస్తి నష్టాలు చాలా వరకు నివారించగలిగామని చెప్పుకొచ్చారు.
తుఫాన్ ప్రభావంతో విద్యుత్ శాఖకు ఊహించని నష్టం వాటిల్లిందని మంత్రి అన్నారు. దాదాపు 8000 స్తంభాలు పడిపోయాయని.. 36 సబ్ స్టేషన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. మ్యాన్‌పవర్, మెటీరియల్ పూర్తిగా ఉన్నప్పటికీ పనిచేసేందుకు ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు లేవన్నారు. నిన్న (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారని.. తెలంగాణ నుంచి వెయ్యి మంది కార్మికులను రప్పించారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి మరి కొంతమందిని తీసుకురావడం జరుగుతుందన్నారు.
ఈరోజు రాత్రికి అన్ని మున్సిపాలిటీలకు విద్యుత్ సరఫరా 100 శాతం పునరుద్ధరించేందుకు టార్గెట్ పెట్టుకున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కొక్క ఎస్ఈని ఇన్‌ఛార్జ్‌గా నియమించి 250 మంది కార్మికులతో పనులను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పనిచేసుకునేందుకు ఆయా ప్రాంతాలకు పూర్తిగా పవర్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో కొన్నిచోట్ల కరెంటు పునరుద్ధరించామన్నారు. ఒకరోజు ఆలస్యమైన పూర్తిస్థాయిలో త్వరగా కరెంటు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా లెక్టర్ మహేష్ కుమార్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీ తేజ్(IAS), ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ సూర్య సాయి ప్రవీణ్ చంద్ (IAS) పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో
Read Latest AP News And Telugu News