రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. నేడు రెండో విడత నిధుల విడుదల!
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:44 AM
రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి, అక్టోబర్ 30: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం రెండో విడత కింద నేడు రూ.3,125.47 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు ఈ నిధులు అందనున్నాయని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6 వేలు సమకూరుస్తున్నాయని వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఖరీఫ్‌లో రూ.7 వేలు, రబీలో రూ.7 వేలు, వేసవిలో రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో రైతులకు సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
రైతులకు ఆర్థిక భరోసా.. రూ.17,789 కోట్లకు చేరనున్న సాయం..
రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అచ్చెన్నాయుడు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.8,985.41 కోట్లు, 2026–27 తొలి విడతలో రూ.3,125.47 కోట్లను రైతులకు అందించినట్లు పేర్కొన్నారు. నేటి రెండో విడత నిధులతో పాటు 2024–25 సంవత్సరానికి సంబంధించిన పీఎం కిసాన్ నిధులను కలుపుకుంటే రైతులకు అందించే మొత్తం ఆర్థిక సాయం రూ.17,789.80 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వం, ప్రధాని మోదీ సహకారంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు సాగు పెట్టుబడి సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సాయం అందిస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కష్టసమయాల్లోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు స్వరం సిద్ధం
ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు
For More National News And Telugu News