Share News

రూ.50వేల కోట్ల విలువైన భూములు కాజేసే కుట్ర.. గత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:03 PM

మియాపూర్ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

రూ.50వేల కోట్ల విలువైన భూములు కాజేసే కుట్ర.. గత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్
CM Revanth Reddy

ఢిల్లీ, అక్టోబర్ 30: మియాపూర్ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. రూ.50వేల కోట్ల విలువైన భూములు కాజేయాలని చూశారని ఆరోపించారు. మియాపూర్ భూముల వివాదాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్, ఆయన అనుచరులు కలిసి భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మియాపూర్‌లో 550 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూశారని ఆరోపణలు గుప్పించారు. సుప్రీంలో బలమైన వాదనలు వినిపించి భూములను కాపాడామన్నారు. సుప్రీం తీర్పు రాగానే భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అవసరమైతే భూములను వేలం వేసి పేదల కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు.


ఐఎమ్‌జీ (IMG) భూముల అంశంలోనూ కోర్టుల్లో బలంగా వాదనలు వినిపించామని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. మంచిరేవులలోని 143 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. ఈ అంశంపైనా కోర్టుల్లో కొట్లాడి భూములను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో 50ఎకరాలు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు కేటాయించినట్లు వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక కబ్జాకోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని సీఎం తెలిపారు.


కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో గెలిచామని సీఎం అన్నారు. గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీం కోర్టులో పోరాడామని తెలిపారు. ప్రభుత్వం పోరాటంతో అది అటవీ భూమి అని సుప్రీం కోర్టు తెల్చి చెప్పిందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా అప్పగిస్తే సుప్రీం కోర్టులో పోరాడి రక్షించామని చెప్పుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను రక్షించామన్నారు.


వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గం ఉపసంఘం ఈ భూముల విక్రయం ద్వారా వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుందని రేవంత్ వెల్లడించారు. హరీశ్ రావు మామ హనుమంత రావు కబ్జా పెట్టిన భూములను సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుంటున్నారని.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. భూముల ఆక్రమణపై ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అనేక తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాసనసభలో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కనీసం రెవెన్యూ అధికారులను ఎందుకు అభినందించడం లేదని నిలదీశారు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీశ్ రావు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదని అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిపై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారని ఆరోపించారు.


మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానాలని సీఎం హితవుపలికారు. మియాపూర్ భూముల విక్రయంతో వచ్చే నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తామన్నారు. వాళ్ల భూముల ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సీఎం డిమాండ్ చేశారు. రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. అక్కడి ఆక్రమణలను తేల్చి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని, ఆక్రమణలు చేయడం మానుకోవాలన్నారు. వాళ్ల ఆక్రమణలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు స్వరం సిద్ధం

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 03:10 PM