ఆన్‌లైన్‌లో స్థానిక ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లు.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:24 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నట్లు ఏపీ హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదించింది.
అమరావతి, అక్టోబర్ 30: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నట్లు ఏపీ హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదించింది. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వల్లపర్ల శివ కార్తీక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఎస్‌ఈసీ.. అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను అఫిడవిట్ ద్వారా న్యాయస్థానానికి వివరించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఎస్‌ఈసీ తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా మున్సిపల్, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు వెల్లడించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, సెల్ఫ్ అఫిడవిట్లు కూడా వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించామని హైకోర్టుకు తెలిపింది. పోలింగ్ తేదీకి ముందుగానే అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
భారీ స్థాయిలో ఉండే డేటా దృష్ట్యా PR&RD, మున్సిపల్ శాఖల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. సంబంధిత శాఖల వెబ్‌సైట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి లింకులు ఇవ్వాలని సూచించింది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచిస్తూ.. ఈ మేరకు PR&RD, మున్సిపల్ శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఆన్‌లైన్‌లో వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో
Read Latest AP News And Telugu News