విజయవాడలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: ఎంపీ శివనాథ్
ABN , Publish Date - Oct 10 , 2026 | 09:38 PM
దసరా ఉత్సవాలతో పాటు, విజయవాడ ఉత్సవ్ సీజన్ 2.0ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాలతో పాటు, విజయవాడ ఉత్సవ్ సీజన్ 2.0ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (TDP MP Kesineni Sivanath)వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తామని ఉద్ఘాటించారు. ఈరోజు (శనివారం) విజయవాడలో శివనాథ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిరు వ్యాపారులకు ఆర్థిక వనరులు పెరగాలని చెప్పారు. రేపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ ఉత్సవ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. లోకల్ టాలెంట్ కోసం 45 నిమిషాలు, మన కళాకారులను ప్రోత్సహించేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.
ఈసారి ఉత్సవ్‌పై విస్తృతంగా ప్రకటనలు చేశాం..
ఆ తర్వాత అతిథులు సభావేదిక పైకి వస్తారని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పుకొచ్చారు. ఈసారి విజయవాడ 2.0 ఉత్సవ్‌పై విస్తృతంగా ప్రకటనలు చేశామని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు అందించామని తెలిపారు. ఈనెల 14వ తేదీన అమ్మవారిని రాష్ట్రపతి దర్శనం చేసుకుంటారని చెప్పారు. 15వ తేదీన జాతీయ సరస్సు మేళను ప్రారంభిస్తారని అన్నారు. అన్ని రాష్ట్రాల డ్వాక్రా మహిళలతో ఈ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. దసరా ఉత్సవాలు, సరస్సు మేళ, విజయవాడ ఉత్సవ్ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. మన విజయవాడ ఉత్సవ్ విశిష్ఠత గురించి అందరికీ మనం చాటి చెప్పాలన్నారు. మన ఇళ్లు, వ్యాపార కేంద్రాలను అందంగా అలంకరించాలని సూచించారు. వాణిజ్య కేంద్రాలు లక్షలాదిగా వచ్చే వారి కోసం తమ ఉత్పత్తులకు డిస్కౌంట్ ప్రకటించాలని అన్నారు.
అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాలి..
మన దగ్గరకు వచ్చే అతిథులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. మన ప్రాంత ప్రజలు కూడా ఈ మూడు ఉత్సవాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనేక రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు మన విజయవాడ వైభవం తెలుసుకుని దేశం మొత్తం చాటి చెప్పాలని అన్నారు. ఈనెల 13వ తేదీన తమిళనాడు సీఎం, 17వ తేదీన మధ్యప్రదేశ్ సీఎం, ఇతర రాష్ట్రాల సీఎంల షెడ్యూల్ త్వరలోనే ఇస్తామని వెల్లడించారు. గతం కంటే విభిన్నంగా ఈసారి కళా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు, కళాకారులు, లోకల్ టాలెంట్ ప్రోత్సహించే పోటీలు ఉంటాయని చెప్పారు. సినిమా కళాకారులు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. లైవ్ కబడ్డీ, లైవ్ వాలీబాల్ కూడా ఉంటుందని చెప్పారు. గజరాజుల అంబారీ కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మైసూరు తరహాలో ఈ ప్రదర్శన ఉంటుందని అన్నారు. వాణిజ్య సముదాయాల వారు సొంతంగా లైటింగ్‌తో అలంకరించడం విశేషమని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News