రాయచోటిలో 44 వార్డులు ఏకగ్రీవం.. చరిత్రాత్మక విజయమన్న మంత్రి మండిపల్లి
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:13 PM
రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో 44కు 44 వార్డులూ ఏకగ్రీవం అయ్యాయని.. ఇది చరిత్రాత్మక విజయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
అమరావతి, అక్టోబర్ 19: రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో 44కు 44 వార్డులూ ఏకగ్రీవం అయ్యాయని.. ఇది చరిత్రాత్మక విజయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. రాయచోటిలో వైసీపీ ప్రజాదరణ కోల్పోయిందని.. పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులే ముందుకు రాలేదని తెలిపారు. రెండున్నరేళ్లుగా ప్రజలకు దూరంగా ఉండి.. ఇప్పుడు ఎన్నికల సమయంలో అభ్యర్థులను పోటీకి ప్రోత్సహించడం విడ్డూరమని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అన్నారు. వైసీపీ పోటీ చేయని వార్డుల్లోనూ ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
రాయచోటి అభివృద్ధిపై వైసీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రాయచోటిలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయన్నారు. పట్టణ తాగునీటి సమస్య పరిష్కారానికి వెలిగల్లు జలాశయం నుంచి రెండో పైప్‌లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో పార్కులు, ఇండోర్ స్టేడియం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మాదకద్రవ్యాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని.. యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.
రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ వంటి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాయచోటిలో కూటమి విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
మైదుకూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా వేస్తున్నాం: ఎస్‌ఈసీ
Read Latest AP News And Telugu News