పెన్షన్ కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:23 AM
ఏపీ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడాదికి అక్షరాల రూ.2400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 2,80,000 మందికి నెలకు రూ.18 కోట్ల చొప్పున పెన్షన్ చెల్లిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 30 వేల మంది ఎదురుచూపులు!
గ్రామ, వార్డు సచివాలయాలు, యూసీడీ, డీఆర్డీఏ, కలెక్టరేట్లలో దరఖాస్తుల గుట్టలు
మూడేళ్లలో భారీగా పెరిగిన దరఖాస్తులు.. ఆందోళన కలిగిస్తున్న వితంతుల అర్జీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు ఇవ్వాలని వేడుకోలు
ఇప్పటికే 5,17,000 మందికి ఏడాదికి రూ.2400 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఏపీ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడాదికి అక్షరాల రూ.2400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 2,80,000 మందికి నెలకు రూ.18 కోట్ల చొప్పున పెన్షన్ చెల్లిస్తోంది. ఏడాదికి రూ.1,176 కోట్లను పేదలకు ఖర్చు చేస్తోంది. కృష్ణా జిల్లాలో 2,87,000 మందికి నెలకు రూ.102 కోట్లను ఖర్చు చేస్తోంది. ఏడాదికి రూ.1,224 కోట్లను పెన్షన్లకు ఖర్చు చేస్తోంది. పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.4 వేలకు సాధారణ పెన్షన్లను పెంచింది. రూ.15 వేల వరకు వివిధ కేటగిరీల పెన్షన్లు ఇస్తుండటంతో ఎంతోమంది పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.
పెన్షన్ల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి.. మూడేళ్లుగా నూతన పెన్షన్‌కు అవకాశం లేకపోవటంతో గ్రామ, వార్డు సచివాలయాలు, డీఆర్ఏ, యూసీడీ, కలెక్టరేట్లకు వచ్చి దరఖాస్తులను సమర్పిస్తున్నారు. పెన్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లో గుట్టలుగా పడి ఉంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో 30 వేల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నట్లు డీఆర్‌డీఏ అధికారుల అంచనాగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 22వేలు, కృష్ణాజిల్లాలో ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన 22 వేల దరఖాస్తుల్లో విజయవాడ నగరంలో పట్టణ సామాజిక అభివృద్ధి (యూసీడీ) విభాగానికి 10 వేలకు పైగా అర్జీలు వచ్చాయి.
పెరిగిన దరఖాస్తులు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో వృద్ధాప్య పెన్షన్లు పెరిగాయి. అరవై సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ పెన్షన్‌కు అర్హులు కావటంతో దరఖాస్తులు చేస్తున్నారు. కరోనా తర్వాత కారణాలు ఏవైనప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతోంది. అకస్మాత్తుగా వచ్చే గుండెపోట్లు, అవయవాల వైఫల్యం ఇతర జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కారణంగా వృద్ధాప్య వితంతు, ప్రమాదకర వ్యాధుల కేటగిరికి సంబంధించి పెన్షన్ల దరఖాస్తులు ఎక్కువుగా వస్తున్నాయి.
యువ వితంతువులు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెన్షన్లకు యువ వితంతువులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. యువ వితంతువులు పెరగటానికి పైన చెప్పుకున్న అనారోగ్య కారణాలే కాకుండా. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఇతర మరణాలు కారణమని తెలుస్తోంది. చిన్న వయస్సులోనే భర్తలను కోల్పోవాల్సి రావటంతో యువ వితంతువుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తుల లెక్కపై స్పష్టత ఏదీ?
ఉమ్మడి జిల్లా డీఆర్‌డీఏ అధికారుల అంచనాల ప్రకారం 30 వేల దరఖాస్తులు అని చెబుతున్నా.. వాస్తవంగా వచ్చిన దరఖాస్తులపై స్పష్టత లేదు. ఎందుకంటే ముందుగా ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల కోసం ఆర్జీలను సమర్పిస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉండటంతో... లాగిన్ ఇవ్వకపోవటంతో దరఖాస్తులను తమ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇక లాభం లేదని ఎంపీడీవో కార్యాలయాల్లో గ్రీవెన్స్‌కు వెళ్లి అక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. విజయవాడ నగరంలో వార్డు సచివాలయాల్లో పనికావటం లేదని, కార్పొరేషన్ యూసీడీ విభాగానికి వెళ్లి అక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో డీఆర్ఏ కార్యాలయానికి కూడా వెళ్లి దరఖాస్తులు అందజేస్తున్నారు. అంతిమంగా కలెక్టరేట్లలో నిర్వహించే పీజీఆర్ఎస్‌లో దరఖాస్తులను సమర్పిస్తున్నారు. ఎవరి దగ్గర ఉన్న లెక్కలు వారు చెబుతూ మొత్తంగా ఇంత సంఖ్యలో ఉన్నారని చెబుతున్నారు. ఒకే దరఖాస్తు పలు చోట్లకు పదే పదే తిరుగుతుంది కాబట్టి వాస్తవంగా దరఖాస్తుదారులెందరు. అన్నదానిపై స్పష్టత ఉండటం లేదు.
అర్హత కలిగిన పెన్షన్లు తేలాలంటే ఆన్‌లైన్ చేయాలి
మూడేళ్లుగా పెన్షన్ల కోసం ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు అర్హత కలిగినవో, కావో నిర్ణయించాలంటే ఆన్‌లైన్ చేస్తేనే తెలుస్తుంది. ఆన్‌లైన్ విధానంలో ముందు దరఖాస్తులు స్వీకరిస్తే, ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టెప్ట్ వెరిఫికేషన్) చేసే అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లు వినియోగం, కార్లు, భూములు, ఇతర ఆస్తులు వంటివి ఈ విధానంలో పరిశీలిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు కూడా అవకాశం లేకపోవటంతో ప్రామాణికంగా ఉండటం లేదు.
కొత్త పెన్షన్లకు రాని అనుమతులు
కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మధ్యలో భర్తలు చనిపోయిన వితంతువుల కోసం అతి స్వల్ప సంఖ్యలో పెన్షన్లు వదిలారు. తర్వాత నియోజకవర్గానికి 200 పెన్షన్లు అవకాశం కల్పించారు. మండలానికే రెండు వేలకు పైగా దరఖాస్తులు ఉన్నప్పుడు. నియోజకవర్గానికి 200 ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి పర్యటనల్లో పెన్షన్ల కోసం అర్జీలు సమర్పించిన వారికి కానీ, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌కు వచ్చే వారికి అత్యవసరంగా పెన్షన్లు ఇచ్చే నిర్ణయాధికారాలను కలెక్టర్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లకు అత్యవసర పరిస్థితుల్లో వంద వరకు పెన్షన్లు ఇచ్చే అధికారం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా.. సెర్ప్ గడప నుంచి మాత్రం ఆ మేరకు ఉత్తర్వులు రావటం లేదు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటం లేదు. దీంతో మళ్లీ కలెక్టర్లు తమకు వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వానికి పంపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News