Share News

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీబీఐకి బదిలీ అవసరం లేదు.. హైకోర్టులో కౌంటర్

ABN , Publish Date - Jul 13 , 2026 | 09:06 PM

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సీబీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే స్వభావం కలిగినది కాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది.

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీబీఐకి బదిలీ అవసరం లేదు.. హైకోర్టులో కౌంటర్
Sai Krishna Case

అమరావతి, జులై 13 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును (Sai Krishna Case) సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై సీబీఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేది కాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తును చేయిస్తోందని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణ అవసరమని చెప్పడానికి తగిన అసాధారణ పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు.


సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను సీబీఐ అధికారులు ప్రస్తావించారు. అత్యంత అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే ఆయా కేసులను సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. సాధారణంగా ప్రతి కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఆ సంస్థపై కేసుల భారం పెరిగి, పరిమిత వనరులతో కీలకమైన, సంక్లిష్టమైన కేసుల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని తన కౌంటర్‌లో సీబీఐ అధికారులు ప్రస్తావించారు.


అలాగే, ఒకవేళ ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు భావిస్తే, దర్యాప్తు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, సాంకేతిక వనరులు, ఇతర సహాయ సహకారాలను అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ కేసులో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలా లేదా అనే అంశంపై హైకోర్టు తదుపరి విచారణలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ కేసుపై న్యాయపరమైన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 09:40 PM