Share News

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:07 PM

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ట్రంకు రోడ్ల నిర్మాణంలో నివాసాలను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవన భృతిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది.

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట
Amaravati Farmers

అమరావతి, జులై 12 (ఆంధ్రజ్యోతి): సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఊరట కల్పించింది. ట్రంకు రోడ్ల నిర్మాణంలో నివాసాలను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవన భృతిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది.12 నెలల పాటు నెలకు రూ.10 వేల జీవన భృతి అందించనుంది. ఇంటి అద్దెతో కలిపి జీవన భృతి చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏ చర్చల విధానంలో (Negotiated Settlement Policy) సవరణలు చేసింది. జులై 7వ తేదీన జరిగిన 63వ ఏపీసీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన జీవన భృతి అమలు చేయాలని ఏపీసీఆర్డీఏ కమిషనర్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


రుణమాఫీ అమలు చేయాలి..

ల్యాండ్ పూలింగ్ రైతులకు రుణమాఫీ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధానిలో రెండో దశలో ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీ సర్కార్ యాన్యుటీ పెంచింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంచింది. 2024 జూన్ 12వ తేదీ తర్వాత ఒప్పందం చేసిన రైతులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పదేళ్ల పాటు యాన్యుటీ చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. CRDA ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలు చేసింది. రూ.10 వేల చొప్పున మెట్ట, జరీబు భూముల యాన్యుటీని ఏపీ సర్కార్ పెంచింది.


డెట్ వేవర్ స్కీమ్‌కు ఆమోదం

గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఏడు గ్రామాల్లో డెట్ వేవర్ స్కీమ్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏ కమిషనర్‌కు రుణమాఫీ అమలు చేసే అధికారాలను ఏపీ సర్కార్ కల్పించింది. ల్యాండ్ పూలింగ్ పరిధిలోని రైతుల వ్యవసాయ రుణాల మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుణమాఫీ అమలుకు ప్రత్యేక కార్యాచరణ మార్గదర్శకాలను ఏపీసీఆర్డీఏ రూపొందించనుంది. 06-01-2026 నాటికి ఉన్న వ్యవసాయ రుణాలకే అర్హత కల్పించాలని స్పష్టం చేసింది. ఏపీసీఆర్డీఏ చట్టం సెక్షన్ 55(4) తొలి నోటిఫికేషన్ తేదీనే కట్-ఆఫ్‌గా నిర్ణయం తీసుకుంది. తాజాగా కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్-148ను ఏపీ సర్కార్ జారీ చేసింది.


రూ.1,122.86 కోట్ల ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ ఆమోదం..

పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,122.86 కోట్ల ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ బాండ్ల ద్వారా రూ.1,010.58 కోట్లను సమీకరించనుంది. పూల్డ్ మున్సిపల్ బాండ్ ఇష్యూ ఫ్రేమ్‌వర్క్‌కు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. పట్టణాభివృద్ధి నిధుల సమీకరణకు మార్కెట్ ఆధారిత విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. APUIAMLను పూల్డ్ మున్సిపల్ బాండ్ కార్యక్రమానికి ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించింది. మర్చంట్ బ్యాంకర్ ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. బాండ్ జారీకి ముందు పాల్గొనే పట్టణ స్థానిక సంస్థలకు క్రెడిట్ రేటింగ్ తప్పనిసరని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే బాండ్ జారీ ప్రక్రియ చేయాలని నిర్ణయించింది. బాండ్ రుణాల చెల్లింపు బాధ్యత పూర్తిగా సంబంధిత పట్టణ స్థానిక సంస్థలదేనని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 07:12 PM