Share News

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

ABN , Publish Date - Jul 15 , 2026 | 09:38 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే ఆలోచన ఆయనదని విమర్శించారు.

 జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం
AP Minister Nimmala Ramanaidu

ఎన్టీఆర్ జిల్లా, జులై 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస మనస్తత్వం జగన్‌దని ధ్వజమెత్తారు. కరవు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే ఆలోచన ఆయనదని విమర్శించారు. ఈరోజు (బుధవారం) పవిత్ర సంగమం వద్ద 11 గంటలకు జలహారతిని సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు.


రైతు ద్రోహి జగన్..

రైతు ద్రోహి జగన్ అని.. అలాంటి వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎల్‌నినో కారణంగా ఏపీలో ఎక్కడా ఒక చుక్క నీరు కూడా లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ప్రాజెక్టుల్లో నీళ్లు లేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే ఈరోజు రైతన్నలకు పట్టిసీమ ప్రాణం పోస్తోందని ఉద్ఘాటించారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు పట్టిసీమతో భద్రత కల్పించారని తెలిపారు. పోలవరం పూర్తి అయ్యేలోపు పట్టిసీమ ద్వారా నీళ్లు పంపిస్తామని చెప్పారు. పట్టిసీమను వట్టిసీమ అని మాట్లాడిన జగన్ కృష్ణానది ఒడ్డుకొచ్చి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.


పట్టిసీమ రైతున్నలకు భరోసా..

రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందని మంత్రి నిమ్మల తెలిపారు. పట్టిసీమను వట్టిసీమ అన్న గొడ్డలిపార్టీ నాయకుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 445కు పైగా టీఎంసీలను కృష్ణాడెల్టాకు తరలించామని తెలిపారు. ఈసీజన్‌లో ఇప్పటికే 3 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణానదిలోకి తరలించామని వెల్లడించారు. తీవ్ర కరవు పరిస్థితుల్లో 13.08 లక్షల ఆయకట్టు ఉన్న కృష్ణాడెల్టాకు నేడు పట్టిసీమ నీళ్లు ఊపిరిపోస్తున్నాయని తెలిపారు. పట్టిసీమ కేవలం కృష్ణాడెల్టాకు మాత్రమే పరిమితం కాదని.. రాయలసీమకు సైతం నీటి భద్రత కల్పించిన పథకమని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి విజయవంతమైన నదుల అనుసంధాన పథకంగా ఇది గుర్తింపు పొందిందని వివరించారు. పట్టిసీమ కేవలం ఒక ఎత్తిపోతల పథకం కాదని, అన్నదాతలకు ఓ భరోసా అని ఉద్ఘాటించారు.


అందుకే పట్టిసీమ వైపు జగన్ కన్నెత్తి చూడలేదు..

దూరదృష్టి, ముందుచూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏవిధంగా మేలు జరుగుతుందో పట్టిసీమే ఉదాహరణ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు. పాలన అనుభవం లేకపోవడం, విధ్వంసపు ఆలోచనలు, ముందుచూపు లేకపోవడం వల్లే గొడ్డలి పార్టీ నాయకుడు పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సూచనలతో సూపర్ ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టునూ వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ఆల్మట్టి నుంచి జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ వరకు ఖాళీ జలాశయాలతో ఉన్న కృష్ణాకు ఈ పట్టిసీమ నేడు ఊపిరి పోస్తోందని వివరించారు. పట్టిసీమ కట్టి రూ.1300 కోట్లను నీటిపాల్జేశారని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కృష్ణాడెల్టా బీడుగా మారి, కరవు కాటకాలతో దుర్భిక్షంగా ఉండాలనేది జగన్ ఆలోచన అని ఎద్దేవా చేశారు.


కేఎల్ రావు‌కు నివాళి అర్పించిన మంత్రి నిమ్మల..

ప్రఖ్యాత ఇంజినీర్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎల్ రావు కుమారుడు విజయ్ రావు, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్. కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్, వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడని కీర్తించారు. నాడు వాజ్‌పేయీ, నేడు నరేంద్రమోదీ, చంద్రబాబు నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణాజలాలతో నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.


పట్టిసీమను కొంతమంది దుర్మార్గులు హేళన చేశారు: ఎమ్మెల్యే వసంత

కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా 12 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు పంపించడం సీఎం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం మీద గతంలో ఇది పట్టిసీమ కాదని.. వట్టిసీమని కొంతమంది దుర్మార్గులు హేళన చేశారని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గులకు ఇదే కనువిప్పు కావాలని చెప్పుకొచ్చారు. సాగునీరుకే కాకుండా తాగునీరుకు కూడా పట్టిసీమ భరోసా కల్పిస్తోందని వసంత కృష్ణప్రసాద్ ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగిస్తున్నాం: రామ్మోహన్

రాయలసీమను జగన్ ముంచేశారు.. సోమిరెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 01:23 PM