జగన్ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో దోచుకున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:40 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjirapu Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. వారికి కేటాయించిన డబ్బులు ఇతర వాటికి ఉపయోగించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో వల, తెప్ప ఏవీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. చిరిగిన వలను కుట్టుకోవడానికి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహించారు. జగన్ హయాంలో చాలా బకాయిలు పెట్టడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు.
మత్స్యకారుల కోసం సంక్షేమ పథకాలు..
విజయవాడలో గురువారం ఏపీ ఫిషరీస్ ఛైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకార సభ జరిగింది. ఏపీ ఆఫ్కాఫ్ ఛైర్మన్‌గా యాటగిరి రాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సభలో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఫిషరీస్ సొసైటీ వృద్ది చెందిన తీరుపై అధ్యయనం చేస్తామని తెలిపారు. ఏపీలో మంవి ఫలితాలు సాధించేలా శిక్షణ ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. 2019కి ముందు చంద్రబాబు మత్స్యకారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా సరిచేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
పాత బకాయిలను చెల్లిస్తున్నాం..
పాత బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అందించే సహకారంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఛైర్మన్, డైరెక్టర్ అని కాకుండా అందరూ కలిసి మత్స్యకారులు అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. బీసీల్లో ఉన్న అన్నికులాల వారు ఆర్థికంగా ఎదగాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. వైసీపీ హయాంలో మత్స్యకారుడు చనిపోతే వారికి రూ.5లక్షల పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ ప్రస్తుతం ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ఈ 18 నెలల్లో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఎంతో సాయం అందించిందని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మత్స్యకారులకు పూర్తిగా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ
Read Latest AP News And Telugu News