ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ
ABN , Publish Date - Jan 28 , 2026 | 09:07 AM
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు వెలగపూడిలోని సచివాలయానికి 10:15లకు సీఎం రానున్నారు. ఉదయం 10:30లకు కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, కొత్త పెట్టుబడులు, భూ కేటాయింపులపై సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుమారు 35 అంశాలతో కూడిన ఈ అజెండాలో సంక్షేమం, మౌలిక సదుపాయాలు, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నారు.
కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే కీలక అంశాలు:
ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
బడ్జెట్ సమావేశాలు: త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది.
భూ కేటాయింపులు: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ సంస్థలకు భూములు కేటాయించే ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
దావోస్ పర్యటన: ఇటీవల తన దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి, పారిశ్రామికవేత్తల మధ్య కుదిరిన ఒప్పందాలపై చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీ పెట్టుబడుల అమలుపై మంత్రివర్గంతో సీఎం చర్చించే ఛాన్స్ ఉంది.
సంక్షేమ పథకాలు: పెన్షన్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించే అవకాశం ఉంది.
గ్రీన్ కవర్‌పై సీఎం సమీక్ష..
ఏపీలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపు అంశాలపై సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు. అలాగే సాయంత్రం 3:00లకు రైల్వే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. పలు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. సాయంత్రం 6:45లకు సీఎం తన అధికారిక కార్యక్రమాలు ముగించుకుని నివాసానికి చేరుకుంటారు.
మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం..
పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు భారీ ఆర్థిక గ్యారెంటీని ప్రభుత్వం ప్రకటించనుంది. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం పీఎంఏవైయూ కింద రాష్ట్ర వాటాగా గృహ నిర్మాణ పనుల కోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల టర్మ్ లోన్ పొందేందుకు రుణ గ్యారంటీ ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది.
పర్యావరణం: 2026 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా అమరావతి పరిసరాల్లో భారీగా మొక్కలు నాటే కార్యక్రమంపై సీఎం చర్చించనున్నారు. పర్యాటక రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు కొత్త ప్రాజెక్టులకు అనుమతులిస్తూనే, విఫలమైన ఒప్పందాలను రద్దు చేయనుంది. అల్లూరి జిల్లా(నందకోట) ఫైవ్‌స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ భూ కేటాయింపుపై మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది.
రైల్వే కనెక్టివిటీ: ఏపీలో పలు కీలక రైల్వే పనులు జరుగుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించనున్నారు.
శిల్పారామంలో కల్చరల్ సెంటర్‌పై చర్చ..
గుంటూరులోని శిల్పారామంలో కల్చరల్ సెంటర్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అభివృద్ధి కోసం ఏపీ శిల్పారామ సొసైటీ సీఈవో ప్రతిపాదనకు మంత్రి మండలిలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
అమరావతి రాజధాని అభివృద్ధి..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వాస్తు సమస్యల రీత్యా (వీధిపోటు/వీధిశూల) ఇబ్బందిగా ఉన్న ప్లాట్లు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే అధికారాన్ని సీఆర్డీఏ కమిషనర్‌కు కట్టబెట్టనున్నారు.
సామాజిక పింఛన్లు..
అమరావతి పరిధిలో భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు సామాజిక భద్రత కల్పిస్తూ కొత్త పింఛన్ల మంజూరుకు ఆమోదించనున్నారు.
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ..
పిడుగురాళ్లలోని ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ మోడ్‌లో అప్‌గ్రేడ్ చేయడానికి సంబంధించి ఈ నెల 8వ తేదీన జీవో Ms.No.4, 5, 6 HM&FW విభాగం జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది
పలమనేరు భూ బదిలీ..
పలమనేరులోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న పరిశోధనా కేంద్రానికి చెందిన 33 ఎకరాలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేస్తూ ఓ నిర్ణయం తీసుకోనుంది. దీనివల్ల స్థానిక రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
జ్యోతి యర్రాజికి ప్రోత్సాహకం..
ఏపీ గర్వించదగ్గ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజికి ప్రభుత్వం అద్భుతమైన ప్రోత్సాహకాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి కాగానే ఆమెను నేరుగా గ్రూప్-1 ఆఫీసర్‌గా నియమించే ప్రతిపాదనకు ఆమోదించనుంది. విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం కేటాయించనుంది.
టీటీడీపై చర్చ..
టీటీడీలో భక్తుల రద్దీకి అనుగుణంగా పలు పోస్టుల అప్‌గ్రేడ్‌కు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
జలవనరులు: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి కోసం ఆర్థిక అనుమతులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇంధన శాఖ: విద్యుత్ సరఫరా, వ్యవస్థ బలోపేతానికి పరిపాలనా అనుమతులు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మార్పులు తీసుకురానున్నాయని అధికారులు, మంత్రులు భావిస్తున్నారు.
అల్లూరి జిల్లాలో సీఎం పర్యటన..
అల్లూరి జిల్లాలో సీఎం చంద్రబాబు గురువారం పర్యటించనున్నారు. అరకు లోయలో చలి ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు విశాఖపట్నం ఉత్సవాల్లో భాగంగా అరకు లోయలో ఈనెల 29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో అరకు చలి ఉత్సవ్‌ను ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. చలికాలంలో పర్యాటకులను ఆకర్షించేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి
Read Latest AP News And Telugu News