మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. జగన్‌పై మంత్రి డీబీవీ స్వామి ధ్వజం
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:50 PM
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విజయవాడ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం పర్యటనకు తాము ఎప్పుడు ఆటంకం కలిగించమని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి(AP Minister Dola Bala Veeranjaneya Swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విజయవాడ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. జగన్ పర్యటనకు తామెప్పుడూ ఆటంకం కలిగించమని స్పష్టం చేశారు. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వీరాంజనేయ స్వామి హాజరై మాట్లాడారు.
జగన్ పర్యటన వల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దు..
జగన్ పర్యటన వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని మంత్రి చెప్పుకొచ్చారు. మాజీ సీఎం పర్యటన వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వంపై బురదజల్లితే చూస్తు ఊరుకోమని హెచ్చరించిన ఆయన.. జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎక్కువసేపు ఆపించద్దని సీఎం చంద్రబాబు తమను ఆదేశించారని.. ప్రజల సౌఖ్యమే మనకు కావాలని చెబుతారని మంత్రి ప్రస్తావించారు. జగన్ పెళ్లిళ్లు, ఫంక్షన్ల వద్ద కూడా తమ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తన బుద్ధి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలి..
2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ‘ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. జీడీపీలో మూడో స్థానంలో చేరబోతున్నాం. మనమిత్ర, ఆదర్ సెంటర్స్, మీ సేవ వంటి టెక్నాలజీ మొత్తాన్ని మన శాఖ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన సుమారు 100 సేవలను మేము అందిస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల నుంచి ఈ సేవలు అందిస్తున్నాం. వీటి తనిఖీల కోసం కోసం సుమారు 70 నుంచి 100 మంది సిబ్బంది కేటాయిస్తున్నాం. లోపాలు సరిదిద్ది సక్రమమైన మార్గంలో ప్రజల కోసం సరైన సేవలు అందిస్తాం. కొత్త సిబ్బందికి ఓరియెంటేషన్ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. క్వాలిటీ వర్క్ చేయించుకోవడానికే ఇంత మంది సిబ్బందిని కేటాయిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం’ అని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News