Share News

రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 18 , 2026 | 02:17 PM

రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

కృష్ణా జిల్లా, జులై 18 (ఆంధ్రజ్యోతి): రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) హెచ్చరించారు. ఈరోజు (శనివారం) గుడివాడలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమృత్‌ 2.0 AIUDF శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గొడ్డలి పార్టీతో పెద్ద సమస్య వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్‌గా మారారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్‌ చేస్తే ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు. పోస్టర్లు, కటౌట్‌లకు పొట్టేళ్లను బలి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ లక్ష్యం ప్రజలను దోపిడీ చేయడమేనని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదని అన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.


కాలుష్యం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది..

కాలుష్యం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్ట్‌గా తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో అక్టోబర్‌ 2వ తేదీ నాటికి చెత్తలేకుండా చేస్తామని చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. అంగన్‌ వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పనిచేసే కార్మికులకు తల్లికి వందనం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


పట్టిసీమ నిర్మిస్తుంటే వ్యతిరేకించారు..

పట్టిసీమ నిర్మిస్తుంటే చాలామంది వ్యతిరేకించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని అన్నారు. ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఏపీకి జీవనాడి అని ఉద్ఘాటించారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తానని చెప్పారు. నదులన్నీ అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. ముందుచూపుతోనే ప్రకృతి సేద్యాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఆక్వా రంగానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. పొగాకు రైతులను కూడా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 02:35 PM