Share News

Yanamala: దురుద్దేశంతోనే అమరావతిపై జగన్ వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:57 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు..

Yanamala: దురుద్దేశంతోనే అమరావతిపై జగన్ వ్యాఖ్యలు..
Yanamala Ramakrishnudu

అమరావతి, జనవరి11(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) వ్యగ్యాస్త్రాలు సంధించారు. రాజధాని అమరావతిపై జగన్ అసంబద్ధ ప్రకటనలతో ప్రజల్లో నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదని ఆయన చెప్పడం, రాజ్యాంగంపై ఆయనకు ఉన్న అవగాహన రాహిత్యానికి నిదర్శనమని సెటైర్లు గుప్పించారు. ప్రతిపక్షంలో అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమన్న జగన్, ముఖ్యమంత్రిగా మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారని ప్రస్తావించారు.


మూడు వేర్వేరు మాటలు..

అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా అమరావతి నదీ తీరంలో ఉండకూడదంటూ ఒకే అంశంపై మూడు వేర్వేరు సందర్భాల్లో మూడు వేర్వేరు మాటలు చెప్పటం అతని గందరగోళతనాన్ని ప్రతిబింబిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని అనేక జాతీయ రాజధానులు, ప్రధాన నగరాలు నదీ తీరాలపైనే అభివృద్ధి చెందాయని తెలిపారు. నీటి వనరులు, వాణిజ్యం, రవాణా వంటి కీలక అవసరాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయని వెల్లడించారు. డాన్యూబ్ నది ఆస్ట్రియా రాజధాని వియన్నా, స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా, హంగేరీ రాజధాని బుడాపెస్ట్, సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ నాలుగు రాజధానుల ద్వారా ప్రవహించడం ప్రపంచ ప్రసిద్ధ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.


జగన్ లక్ష్యమిదే..

నైలునదిపై కైరో, థేమ్స్‌పై లండన్, సైన్‌పై పారిస్, పోటోమాక్‌పై వాషింగ్టన్ డీసీ వంటి రాజధానులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు. అమరావతిలో అభివృద్ధి జరిగితే ఏపీ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని వివరించారు. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, సమగ్ర అభివృద్ధికి బలమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని.. ఇది జగన్‌కు ఇష్టం లేకపోవడం దురదృష్టకరమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 12:10 PM