Share News

మహానాడుపై టీడీపీ కీలక నిర్ణయం.. మంగళగిరిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహణ

ABN , Publish Date - May 15 , 2026 | 07:51 PM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

మహానాడుపై టీడీపీ  కీలక నిర్ణయం.. మంగళగిరిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహణ
Mahanadu Event

అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై (TDP Mahanadu) హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.


రెండు రోజుల పాటు మహానాడు..

ఈ మేరకు మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలు ప్రత్యక్షంగా పాల్గొనగా, జిల్లాలు, నియోజకవర్గాలు, క్లస్టర్ల స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు. మంగళగిరిలో జరిగే మహానాడుకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రత్యక్షంగా హాజరవుతారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల నుంచి ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.


ప్రత్యేక ఏర్పాట్లు..

పార్టీకి చెందిన 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు కూడా ఆయా క్లస్టర్ల నుంచే వర్చువల్‌గా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఒకేసారి మహానాడును వీక్షించేలా సాంకేతిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మహానాడులో ప్రవేశపెట్టే రాజకీయ, ఆర్థిక, సంక్షేమ తీర్మానాలు సహా అన్ని కార్యక్రమాలు సంప్రదాయ మహానాడు తరహాలోనే నిర్వహించనున్నట్లు టీడీనీ నేతలు వెల్లడించారు. తీర్మానాల ఆమోదం, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు అన్నీ హైబ్రిడ్ మోడల్‌లో కొనసాగనున్నాయి.


హైబ్రిడ్ విధానంపై ఆసక్తి..

పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ విధానాలపై చర్చ, భవిష్యత్తు రాజకీయ వ్యూహాల రూపకల్పన వంటి అంశాలు ఈ మహానాడులో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. భారీ జన సమీకరణకు బదులుగా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను అనుసంధానించే విధంగా ఈసారి మహానాడును నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ చరిత్రలో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీ కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచుతూ, సమర్థవంతమైన నిర్వహణకు ఈ విధానం ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 08:05 PM