Share News

జగన్ కేసుల్లో 13 ఏళ్ల జాప్యం.. రాజ్యసభలో ప్రస్తావించిన టీడీపీ ఎంపీ విజయ్

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:53 PM

పార్లమెంట్, రాజ్యసభలో ప్రతిపాదించిన 'సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (సవరణ) బిల్లు - 2026'కు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడం సకాలంలో తీసుకున్న అభినందనీయమైన నిర్ణయమని పేర్కొన్నారు.

జగన్ కేసుల్లో 13 ఏళ్ల జాప్యం.. రాజ్యసభలో ప్రస్తావించిన టీడీపీ ఎంపీ విజయ్
TDP MP Chintakayala Vijay

ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్, రాజ్యసభలో ప్రతిపాదించిన 'సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (సవరణ) బిల్లు - 2026'కు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ చింతకాయల విజయ్ (TDP MP Chintakayala Vijay) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడం సకాలంలో తీసుకున్న అభినందనీయమైన నిర్ణయమని పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించే దిశగా ఈ-కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని, అమరావతిలో జ్యుడీషియల్ మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ను ఎంపీ విజయ్ సభలో ప్రముఖంగా ప్రశంసించారు.


జగన్ కేసుల విచారణ ముందుకు సాగలేదు

చట్టం ముందు సామాన్యులైనా, అత్యంత బలవంతులైనా సమానులేనని, న్యాయం ఆలస్యం అవడమంటే న్యాయం నిరాకరించినట్లేనని ఎంపీ విజయ్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను ఆయన రాజ్యసభ సాక్షిగా ప్రస్తావించారు. జగన్‌పై 2013లో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు 13 ఏళ్లు గడుస్తున్నా విచారణ ముందుకు సాగలేదని ప్రశ్నించారు. డిశ్చార్జ్ పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీల సాకుతో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సకాలంలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సుదీర్ఘ జాప్యాల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని ఎంపీ విజయ్ కుండబద్దలు కొట్టారు.


పారదర్శకంగా న్యాయం అందాలి..

భారత జనాభా 150 కోట్లకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో, సామాన్యులకు సైతం వేగంగా, పారదర్శకంగా న్యాయం అందాలన్నదే తమ ఆకాంక్ష అని ఎంపీ విజయ్ తెలిపారు. ఈ వ్యవస్థపై ప్రజలకు పూర్తి భరోసా కలగాలంటే కేవలం అత్యున్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులు, కిందిస్థాయి కోర్టులు, ముఖ్యంగా ప్రత్యేక సీబీఐ కోర్టులను సైతం ఏకకాలంలో బలోపేతం చేసి తీర్పులు వేగవంతం చేయాలని ఎంపీ చింతకాయల విజయ్ డిమాండ్ చేశారు.


వార్తలు కూడా చదవండి...

అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 05:20 PM