సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - May 10 , 2026 | 05:30 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌లో ఆదివారం పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి మోదీ వెళ్లారు.
హైదరాబాద్, మే10 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) హైదరాబాద్‌లో ఈ రోజు(ఆదివారం) పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నివాసానికి మోదీ వెళ్లారు. ప్రధాని స్వయంగా తమ ఇంటికి రావడాన్ని చంద్రబాబు కుటుంబం ప్రత్యేక సందర్భంగా భావిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని రాకను గురించి చంద్రబాబు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోదీ పర్యటన రాజకీయంగా, వ్యక్తిగతంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఇప్పటికే అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రధాని మోదీతో సమావేశమైనప్పటికీ.. ఇరువురూ దీనిని ఓ గొప్ప సందర్భంగా చూస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని ఇంటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకడం నుంచి ఆతిథ్యం వరకు అన్ని విషయాలను మంత్రి లోకేశ్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధానికి అందించే విందులో తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మెనూ ఎంపిక చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రధానికి అందించే విందులో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ రుచులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
మోదీ - లోకేశ్ అనుబంధంపై చర్చ..
రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీకి నారా లోకేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఢిల్లీలో లోకేశ్‌ను స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి ప్రధాని మోదీ సుమారు రెండున్నర గంటల పాటు సమావేశమైన విషయం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగే అవకాశముంది.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు. ప్రధాని మోదీకి తెలుగు సంప్రదాయ ఆతిథ్యం ఇవ్వడానికి నారా కుటుంబం చేస్తున్న ఏర్పాట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News