క్రియా, అష్టాంగ యోగాలు నా జీవితంలో భాగం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:58 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది భారతదేశ నాగరికతా జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు.
అమరావతి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది భారతదేశ నాగరికతా జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక అమూల్యమైన కానుక యోగా అని అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, అంతర్గత సమతుల్యత, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
చిన్న వయసులోనే యోగా ప్రయాణాన్ని ప్రారంభించా..
ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంగా స్వీకరించి, దానిని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను చిన్న వయసులోనే యోగా ప్రయాణాన్ని ప్రారంభించానని ప్రస్తావించారు. తన మనస్సు అనేక ప్రశ్నలతో నిండి ఉన్న సమయంలో, యోగా తనకు కేవలం సమాధానాలనే కాకుండా, తన ప్రయాణాన్ని సమగ్రంగా ప్రభావితం చేసిన స్పష్టతను, అంతర్గత పరిపక్వతను కూడా అందించిందని తెలిపారు. క్రియా, అష్టాంగ యోగాలు, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వారి సుదర్శన క్రియ వంటి అభ్యాసాలు ఇప్పటికీ తన దైనందిన జీవితంలో అంతర్భాగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేశారని తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేలా ప్రధాని మోదీ దూరదృష్టితో కూడిన చొరవ చూపించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు
నేను హోం మంత్రిని కాదు... అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కల్యాణ్
25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News