Cyclone Alert: రెయిన్ అలర్ట్... వాయుగుండం ప్రభావంతో వర్షాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:54 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో గాలుల వేగం పెరగడం, సముద్ర పరిస్థితులు మారడం వంటి ప్రభావాలు కనిపించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అమరావతి, జనవరి8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (AP Rain Alert) మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న(బుధవారం) సాయంత్రానికి ఈ వాయుగుండం పొట్టువిల్(శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలా(శ్రీలంక)కు 620 కిలోమీటర్లు, కరైకల్(తమిళనాడు)కు 990 కిలోమీటర్లు, చెన్నైకి1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. గురువారానికి తీవ్రాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
గణనీయమైన మార్పులు..
ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Cyclone Alert) కారణంగా ఏపీ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో గురు, శుక్ర, శని మూడు రోజుల పాటు వానలు పడతాయని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుఫాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.
బలపడుతున్న వాయుగుండం..
వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ వాయుగుండం ప్రభావం నేరుగా లేదా పరోక్షంగా ఏపీపై పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. సముద్ర తీరం వెంట ఉండే జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
జిల్లాల వారీగా ప్రభావం..
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు అప్పుడప్పుడు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు.
24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా ..
వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం కారణంగా సముద్ర తీరంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మారుతున్న పరిస్థితుల కారణంగా వాయుగుండం వేగంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బలమైన గాలులు..
వాయుగుండం ప్రభావంతో గాలుల వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సముద్ర పరిస్థితులపై ప్రభావం..
తీవ్ర వాయుగుండంగా మారితే సముద్రం అలజడిగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచనలు చేశారు. తీరప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
ఏపీలో వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాల కారణంగా నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్య సూచనలు..
వాతావరణ శాఖ విడుదల చేసే తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. గాలులు ఎక్కువగా వీచే సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకూడదని చెప్పుకొచ్చారు. తీరప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్ర ప్రయాణాలు తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.
ఏపీపై ప్రభావం..
బంగాళాఖాతంలో తరచుగా ఏర్పడే వాయుగుండాలు దక్షిణ భారత రాష్ట్రాల వాతావరణంపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా శీతాకాలం, వానాకాలం మధ్య కాలంలో ఈ తరహా వాయుగుండాలు ఏర్పడుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వాయుగుండం కూడా అదే విధంగా ఏపీతో పాటు సమీప రాష్ట్రాల వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా బులెటిన్లు, హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే ఆయా జిల్లాల యంత్రంగాల ద్వారా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈక్రమంలో ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండి తమ సూచనలు పాటిస్తే ఎలాంటి నష్టాన్ని అయిన నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పర్యావరణ పరిరక్షణలో ఏపీకి కొత్త దిశ
వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన
Read Latest AP News And Telugu News