Share News

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:04 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీర్ఘకాలిక పర్యావరణ రక్షణగా నిలవనున్న ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Pawan Kalyan:  పర్యావరణ పరిరక్షణపై  పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Pawan Kalyan

అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్ట్‌పై ఏపీ సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ లక్ష్యాలు, అమలు విధానం, కాలపరిమితి, పర్యావరణ ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన శాఖల సమన్వయం, నిధుల వినియోగం, దశలవారీ కార్యాచరణపై మాట్లాడారు.


2030 నాటికి గ్రీన్ వాల్ నిర్మాణ లక్ష్యం

అధికారుల వివరాల ప్రకారం, ఈ ప్రతిష్ఠాత్మక పర్యావరణ ప్రాజెక్ట్‌ను 2030 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలోని 1,034 కిలోమీటర్ల తీరప్రాంతం వెంట 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ గ్రీన్ వాల్ ద్వారా తీరప్రాంతాలను పర్యావరణ పరంగా బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన సహజ వనరులు అందుబాటులో ఉంచడం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.


తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల నుంచి రక్షణ

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌ను జీవన పర్యావరణ కవచంగా అభివర్ణించారు. తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత వంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను, భూభాగాన్ని రక్షించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రత్యేకంగా తీరప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న పర్యావరణ ప్రమాదాలకు ఇది దీర్ఘకాలిక పరిష్కారంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పర్యావరణ పరంగా మైలురాయిగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, నిపుణుల సూచనలతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని స్పష్టం చేశారు.


జీవవైవిధ్యం, జీవనోపాధి పెంపే లక్ష్యం

ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం పర్యావరణ రక్షణే కాకుండా, జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు, తీరప్రాంత రైతులు, అటవీ ఆధారిత జీవనోపాధులపై ఆధారపడే వర్గాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా లాభం చేకూరుతుందని వివరించారు.


ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్‌వాల్ నుంచి ప్రేరణ

ఈ ప్రాజెక్ట్ రూపకల్పనకు ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్‌వాల్ నుంచి ప్రేరణ పొందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా మడ అడవులు (మ్యాంగ్రోవ్స్), సరుగుడు ఉప్పు తట్టుకునే ఇతర చెట్ల జాతులు నాటడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇవి తీర ప్రాంతాల్లో మట్టి కోతను అడ్డుకోవడంలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకంగా పనిచేస్తాయని అధికారులులు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతీలాల్ దండే, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పీవీ చలపతి రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పోలీసుల ఆపరేషన్.. ఏం చేశారంటే.

వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 01:55 PM