ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:45 PM
ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..
అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం (AP Legislative Council BAC Meeting) ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. రేపు (మంగళవారం) హోంశాఖపై మండలిలో చర్చ జరగనుంది. ఎల్లుండి (బుధవారం) శాసనమండలిలో వ్యవసాయ శాఖపై చర్చ జరగనుంది. ఈ నెల 26వ తేదీన మండలిలో టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీపై చర్చించనున్నారు. ఈ నెల 28వ తేదీన మండలికి సెలవు ప్రకటించిగా, తిరిగి 4వ తేదీన శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ప్రతిపక్షనేత బొత్ససత్యనారాయణ కల్పించుకొని.. అధికార పక్షం బీఏసీ సమావేశంలో ఒకటి చెప్పి సభలో ఇంకొకటి చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
తాము సభలో, బయటా ఒకటే చెబుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. శాసనమండలితో పాటూ సభ బయట కూడా నెయ్యి కల్తీపై చర్చకు రెడీగా ఉన్నామని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా.. సభలో కల్తీ నెయ్యిపై వంద రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారన్నారు. తాము అసెంబ్లీలో, శాసనమండలిలో కూడా కల్తీ నెయ్యిపై చర్చ పెడతామని మొదటి రోజే చెప్పామని ప్రస్తావించారు. బడ్జెట్‌పై చర్చ పెట్టాలని ప్రతిపక్షనేత బొత్ససత్యనారాయణ పట్టుబట్టారు.
ఇప్పటికే బడ్జెట్‌పై చర్చ పూర్తి అయిందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు ప్రజా సమస్యలను గాలికొదిలి, రాజకీయ ప్రయోజనాల అంశాన్ని ఎంచుకొన్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై నాలుగు రోజులు వైసీపీ సభ్యులు సభ సమయాన్ని వృథా చేశారని వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యిపై తాము చర్చకు సిద్ధమని పలుమార్లు చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఎందుకు పట్టించుకోలేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
Read Latest Telangana News And AP News And Telugu News