Share News

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:08 PM

గ్రామీణ డాక్‌ సేవక్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ ఎంత వచ్చానా.. ఏఐ వినియోగం పెరిగినా.. గ్రామీణ డాక్‌ సేవల ప్రయోజనాలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు.

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

గుంటూరు , ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ డాక్‌ సేవక్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ఎంత వచ్చినా.. ఏఐ వినియోగం పెరిగినా.. గ్రామీణ డాక్‌ సేవల ప్రయోజనాలు అత్యంత కీలకమని తెలిపారు. ఒకప్పుడు తపాలాశాఖ ద్వారానే ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాలు జరిగేవని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో 'గ్రామీణ డాక్‌ సేవక్‌' సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్‌ సదస్సు జరిగింది.


మాధవరావు సింధియాతో ప్రత్యేక అనుబంధం..

ఉత్తమ గ్రామీణ డాక్‌ సేవక్‌లకు అతిథులు అవార్డుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. తమ చిన్నప్పుడు అన్నింటికీ పోస్ట్‌మ్యాన్‌పైనే ఆధారపడే వాళ్లమని చెప్పుకొచ్చారు. తాము చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేమని అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి హయాంలో గ్వాలియర్‌ రాజమాతతో కలిసి పనిచేశామని ప్రస్తావించారు. మాధవరావు సింధియాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.


టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తా..

గాజువాకలో ఒక ప్రాంతానికి సింధియా పేరు ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆనాడు వేసిన పునాది వల్లే హైదరాబాద్‌ గొప్ప నగరంగా మారిందని ఉద్ఘాటించారు. తానెప్పుడూ టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తానని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయ రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చేందుకు ఎంతో కృషి చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


తపాలా వ్యవస్థపై ఇంకా విశ్వాసం ఉంది: జ్యోతిరాదిత్య

తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య తెలిపారు. గ్రామపెద్ద, డాక్‌ సేవక్‌ను గ్రామీణులు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో గ్రామీణ డాక్‌ సేవక్‌ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గ్రామీణ డాక్‌ సేవక్‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామీణ డాక్‌ సేవక్‌ల సేవలు మరిచిపోలేమని జ్యోతిరాదిత్య పేర్కొన్నారు.


పార్సిల్‌, ఈ కామర్స్‌ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలి: పెమ్మసాని

ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్‌లో ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థా మనుగడ సాధించలేదని చెప్పుకొచ్చారు. పార్సిల్‌, ఈ కామర్స్‌ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:36 PM