Share News

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'.. అవార్డు

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:24 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముంబైలో జరిగిన కార్యక్రమంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును ది ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'.. అవార్డు
AP CM Chandra babu Naidu

అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) ముంబై వేదికగా ప్రతిష్టాత్మకమైన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' సీఎం దార్శనికతకు, పాలనా సంస్కరణలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వాణిజ్యంలో (Ease of Doing Business) చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ ఈ అవార్డును అందించింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీని కీలక భాగస్వామిగా మలిచినందుకు సీఎంకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం, పేదల సంక్షేమంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.


అమరావతి.. ప్రజా రాజధాని

అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ప్రజా రాజధాని అని సీఎం అభివర్ణించారు. మరోసారి అమరావతిని నిర్మించే అవకాశం తనకు దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర నిర్మాణంలో అమరావతి ఒక ప్రపంచ స్థాయి ఐకాన్‌గా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని, నిధుల పరంగా, మౌలిక సదుపాయాల పరంగా మద్దతు లభిస్తోందని వెల్లడించారు.


కొత్త కాన్సెప్ట్.. P4 మోడల్

పేదరికం నిర్మూలన కోసం P-4 (Public-Private-People Partnership) విధానాన్ని తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలిసి పేదల అభ్యున్నతికి కృషి చేయడమే ఈ P-4 లక్ష్యమని వ్యాఖ్యానించారు. సంపదను సృష్టించి, ఆ సంపదను తిరిగి పేదల సంక్షేమానికి మళ్లించేలా ఈ విధానం ఉండబోతుందని సీఎం వివరించారు. ముంబై పర్యటనలో చంద్రబాబుకు లభించిన ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణకు మరింత బలాన్ని చేకూర్చనుందని అధికారులు తెలిపారు. అమరావతిపై సీఎం వ్యక్తం చేసిన విశ్వాసం ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 07:06 PM