Share News

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:30 PM

'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్‌లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి25 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) తన 130వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన జలసంరక్షణ చర్యలను ప్రశంసించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రసంగంలో అనంతపురం జిల్లా నీటి కథనాన్ని ప్రస్తావించడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కరువుకు నిలయంగా భావించే అనంతపురం జిల్లాలో ప్రజలు, ప్రభుత్వం కలిసి చేపట్టిన జలసంరక్షణ చర్యలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.


మోదీ 'మన్ కీ బాత్'‌లో ఏమన్నారంటే..

అనంతపురం ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆ ప్రాంతంలో 10కి పైగా పురాతన జలాశయాలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. జలవనరుల సంరక్షణతో పాటు, ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించడాన్ని ప్రధాని అభినందించారు.


సీఎం చంద్రబాబు స్పందన..

ప్రధాని ప్రసంగంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర పురోగతిలో జలసంరక్షణ చర్యలను వివరించారు. ఈ ఏడాది మొదటి 'మన్ కీ బాత్' లోనే అనంతపురం ప్రజల శ్రమను గుర్తించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'స్వర్ణ ఆంధ్ర విజన్ - 2047' లోని 10 సూత్రాలలో నీటి భద్రత (Water Security) అత్యంత కీలకమైనదని సీఎం పేర్కొన్నారు. సంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించి జలవనరులను కాపాడుతున్నామని సీఎం వివరించారు. ప్రధాని మాటలు ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రతా మిషన్‌కు మరింత మరింత ప్రోత్సాహం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 06:01 PM