వియత్నాం బోటు ప్రమాదం.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
ABN , Publish Date - Jul 11 , 2026 | 07:06 PM
వియత్నాం బోటు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి, జులై 11 (ఆంధ్రజ్యోతి): వియత్నాం బోటు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన, బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. బాధితులకు అవసరమైన పూర్తి సహాయం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లారని తెలిపారు. వీరిలో 19 మంది ప్రమాదం జరిగిన బోటులో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారిని అధికారులు రక్షించారని పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విహార యాత్రకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారు అంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ఏపీవాసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం అందజేయాలని సీఎం అధికారులను అదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు... వియత్నాం అధికారులతో, అక్కడ భారత ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News