Share News

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:23 PM

పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణలను రెండేళ్లలో చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Tobacco Farmers

ఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతులకు (Tobacco Farmers) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) స్పష్టం చేశారు. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణలను రెండేళ్లలో చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 45 వేల మంది రైతులకు కేంద్ర రుణ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పొగాకు రైతులకు రూ.250 కోట్ల కేంద్ర రుణ సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.


కిలోకు రూ.10ల ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకం..

లో, ఆఫ్ స్టైల్ రకాల పొగాకుకు కిలోకు రూ.10ల ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బ్రైట్ రకానికి – రూ.230, మీడియం రకానికి - రూ.190, లో రకానికి - రూ.110, ఆఫ్ స్టైల్ రకానికి - రూ.130 కనీస కొనుగోలు ధరకు ఎగుమతిదారులు అంగీకారం తెలిపారని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో నేరుగా రాష్ట్ర ప్రోత్సాహక నగదు జమ అవుతుందని తెలిపారు. రేపటి నుంచే ఈ సహాయ ప్యాకేజీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. గత ఏడాది రూ.146 కోట్లతో బ్లాక్ బర్లీ రకం పొగాకును కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.


కూటమి ప్రభుత్వంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు..

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు కూటమి ప్రభుత్వంలోనే పూర్తి అయ్యాయని పెమ్మసాని చెప్పుకొచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన 7 రోడ్లలో 5 రోడ్లు పూర్తి అయ్యాయని వివరించారు. అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయాలు కాకుండా ప్రజా ప్రయోజనాలపై చర్చ జరగాలని సూచించారు. ఏపీకి మంచి ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ కావాలని చంద్రబాబు ఆలోచించారని తెలిపారు. ఈ విమానాశ్రయానికి కావాల్సిన భూమిని సేకరించి నిర్మాణాన్ని పూర్తి చేశారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ టెండర్లకు పిలిచినప్పుడు జీఎంఆర్ ఏపీ మీద ఉన్న ప్రేమతో హై బిల్డింగ్ వేసి మరి టెండర్ దక్కించుకుందని తెలిపారు. ఈ విమానాశ్రయం నుంచి 20వేల టన్నులను ఎక్స్‌పోర్ట్ చేయొచ్చని వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేశామని వివరించారు. ఏడు రెట్ల ప్రయాణికులు పెరిగిన ఇక్కడి నుంచి వెళ్లే విధంగా భోగాపురం విమానాశ్రయం నిర్మించామని వెల్లడించారు.


ఈ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు 2200 ఎకరాల భూసేకరణ చేశారు..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే చంద్రబాబు 2200 ఎకరాల భూసేకరణ చేశారని పెమ్మసాని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారం కోల్పోయిన సమయానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూమి కేవలం 500ఎకరాలు మాత్రం పెండింగ్‌లో ఉందని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించారని వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ కోసం జీఎంఆర్ వేసిన టెండర్‌ను జగన్ రీ టెండర్ చేశారని ప్రస్తావించారు. జగన్ ఐదేళ్ల పాలనలో భోగాపురం విమానాశ్రయాన్ని ముందుకు పోనివ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పలుమార్లు ఈ ఎయిర్‌పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారని తెలిపారు.


భోగాపురం విమానాశ్రయంపై జగన్ డిబేట్‌కు రావాలి..

భోగాపురం విమానాశ్రయం ఐడియా కూటమి ప్రభుత్వానిదే అని పెమ్మసాని స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయంపై జగన్ డిబేట్‌కు రావాలని సవాల్ చేశారు. అమరావతి రైతులను అడ్డుపెట్టి సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా జగన్ కుట్ర చేశారని దుయ్యబట్టారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏడు రోడ్లు కావాలని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఐదు రోడ్లను పూర్తి చేశామని అన్నారు. ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా జగన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని అర్థం చేసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి కావాలని పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 01:41 PM