సింగపూర్‌లో డిజిటల్ పాలనపై ఏపీ మంత్రుల అధ్యయనం.. 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యంగా అడుగులు..
ABN , Publish Date - Apr 27 , 2026 | 10:40 AM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్, జిల్లా, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది. సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.
డిజిటల్ పాలనలో సింగపూర్ మార్కు: ‘డిజిటల్ టు ది కోర్’
సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘డిజిటల్ టు ది కోర్, అండ్ సర్వ్స్ విత్ హార్ట్’ (Digital to the Core, and Serves with Heart) అనే నినాదం మంత్రులను విశేషంగా ఆకర్షించింది. సింగపూర్ ప్రభుత్వ టెక్నాలజీ విభాగంలో(GovTech) సుదీర్ఘ అనుభవం ఉన్న టాన్ ఎంగ్ ఫెంగ్ (Tan Eng Pheng) మంత్రులకు అక్కడి డిజిటల్ వ్యూహాల గురించి వివరించారు.
సింగ్‌పాస్ ప్రాముఖ్యం..
సింగపూర్ పౌరులు, నివాసితులకు అందించే అత్యంత సురక్షితమైన డిజిటల్ గుర్తింపు కార్డు సింగ్‌పాస్. దీని ద్వారా ప్రభుత్వ సేవలను అత్యంత వేగంగా, భద్రంగా ఎలా పొందవచ్చో మంత్రులు తెలుసుకున్నారు.
హెల్త్‌హబ్..
పౌరుల సమగ్ర మెడికల్ రికార్డ్స్, వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరిచే యాప్ హెల్త్‌హబ్. ఎక్కడ ఉన్నా తమ ఆరోగ్య సమాచారాన్ని చూసుకునే వెసులుబాటు కల్పించే ఈ విధానంపై ఆసక్తి కనపరిచారు. నగర పాలనలో డిజిటల్ పబ్లిక్ సర్వీస్ విధానాలను ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై చర్చించారు.
స్వర్ణాంధ్ర - 2047 విజన్..
సింగపూర్‌లో నేర్చుకున్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా 'స్వర్ణాంధ్ర - 2047' విజన్‌లో భాగంగా రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శకమైన, వేగవంతమైన డిజిటల్ పౌర సేవలు, ఆరోగ్య రంగంలో సమగ్ర డిజిటల్ డేటా నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులకు సింగపూర్ కోపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ (SCE) ప్రతినిధులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా తమకు విలువైన సమాచారాన్ని అందించిన టాన్ ఎంగ్ ఫెంగ్‌ను మంత్రులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు
Read Latest Telangana News And AP News And International News And Telugu News