Share News

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 05 , 2026 | 10:50 AM

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
AP POLYCET

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET 2026) ఫలితాలు ఈరోజు (మంగళవారం) విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈసారి పరీక్షల్లో రికార్డు స్థాయిలో విద్యార్థులు పాల్గొనగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37 శాతంగా నమోదైంది.


రికార్డు స్థాయిలో విద్యార్థుల హాజరు..

ఈ సంవత్సరం ఏపీ పాలిసెట్ కోసం మొత్తం 1,77,581 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,63,008 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. ఈ ఫలితాలు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.


91.37శాతం ఉత్తీర్ణత..

ఈసారి మొత్తం 91.37శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది మంచి ఫలితంగా అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఈ ఫలితాలకు కారణమని అభిప్రాయపడ్డారు.

ముందంజలో బాలికలు..

ఈసారి ఫలితాల్లో బాలికలు బాలుర కంటే మెరుగైన ప్రదర్శన కనపరిచారు. బాలికల ఉత్తీర్ణత శాతం 93.57శాతంగా నమోదైంది. ఇది మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు.


జిల్లాల వారీగా ఉత్తమ ఫలితాలు..

గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా ఈసారి అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా – 99.11శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానం, పోలవరం జిల్లా 95.46శాతం ఉత్తీర్ణత, పార్వతీపురం మన్యం జిల్లా 93.45శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఫలితాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి పెరుగుతున్నదానికి సూచనగా నిలుస్తున్నాని అధికారులు తెలిపారు.


మంత్రి నారా లోకేశ్ అభినందనలు

విద్యలో బాలికల ప్రతిభ రాష్ట్ర అభివృద్ధికి కీలకమని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలను ప్రకటించిన మంత్రి లోకేశ్ విద్యార్థులను అభినందించారు. కష్టపడి చదివిన ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఏపీ పాలిసెట్ ఫలితాలు రాష్ట్రంలో సాంకేతిక విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చూపిస్తున్నాయని తెలిపారు. 90 శాతానికి పైగా ఉత్తీర్ణత, బాలికల అద్భుత ప్రదర్శన, గిరిజన జిల్లాల రికార్డు ఫలితాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఆన్‌లైన్‌లో ఫలితాలు అందుబాటులో

ఏపీ పాలిసెట్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ (Mana Mitra WhatsApp) సేవల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఈ అవకాశం విద్యార్థులకు మరింతగా ఉపయోగపడనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu New

s

Updated Date - May 05 , 2026 | 11:30 AM