డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజం సర్జరీ విజయవంతం
ABN , Publish Date - Jul 11 , 2026 | 08:06 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శనివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
అమరావతి, జులై 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు (AP Deputy CM Pawan Kalyan) ఈరోజు (శనివారం) ముంబైలోని ఓ ఆస్పత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్‌షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించారని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు రెండు భుజాల్లోనూ తీవ్రమైన రోటేటర్ కఫ్ గాయాలు ఉన్నట్లు నిర్ధారించారని చెప్పారు. రోటేటర్ కఫ్ చిరగడంతో పాటు, ఆయన కుడి భుజంలో అవల్షన్ ఫ్రాక్చర్ ఏర్పడటంతో ఓ పెద్ద శస్త్రచికిత్స అవసరమైందని అన్నారు. ఆయన కుడి భుజానికి చేసిన ఈ శస్త్రచికిత్స సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగించారని.. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు.
పవన్ కల్యాణ్‌ను ఆపరేషన్ అనంతరం రికవరీ గదికి తరలించారని అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అనస్థీషియా ప్రభావం నుంచి బాగా కోలుకుంటున్నారని చెప్పారు. చికిత్స అందిస్తున్న వైద్య బృందం నిశిత పర్యవేక్షణలో డిప్యూటీ సీఎం ఉన్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇచ్చారని అన్నారు. ముందుగా తన అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందే వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారని చెప్పారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడంతో ఆపరేషన్ తర్వాత గణనీయమైన అసౌకర్యం, కదలిక పరిమితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో వైద్య బృందం మొదట కుడి భుజానికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించిందని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ తగినంత కోలుకున్న తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయాలని ప్రణాళిక చేశారని అధికారులు తెలిపారు. ఆయన అవిశ్రాంత ప్రజా కార్యక్రమాలు, విస్తృత రాజకీయ పర్యటనలు, ఎన్నికల ప్రచారాలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో నిరంతర సంభాషణల కారణంగా, 2016లో అయిన ఈ భుజం గాయాలు సంవత్సరాలు గడిచేకొద్దీ క్రమంగా తీవ్రమయ్యాయని వెల్లడించారు. నిరంతర నొప్పిని భరిస్తున్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి ఎలాంటి అంతరాయం లేకుండా తన అధికారిక బాధ్యతలను నిర్వర్తిస్తూ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారని అన్నారు. పవన్ కల్యాణ్ కోలుకోవడానికి సంబంధించిన మరిన్ని వివరాలు తగిన సమయంలో తెలియజేస్తామని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News