నేడు కేబినెట్ భేటీ.. పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Jul 23 , 2026 | 07:47 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.
అమరావతి, జులై 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈరోజు (గురువారం) వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి నేరుగా సచివాలయానికి చేరుకుని ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిపాలనా అంశాలపై మాట్లాడనున్నారు. దాదాపు 25కు పైగా అజెండా అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను మంత్రిమండలి పరిశీలించనుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా కేబినెట్‌లో సమీక్ష జరగనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రులకు సూచించనుంది. విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అదేవిధంగా కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసేవల మెరుగుదలపై సమీక్షించనున్నారు.
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సమర్థవంతంగా స్పందించే విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక సూచనలు ఇవ్వనున్నారు.
రెండో దశలో APPSC, APSLPRB ద్వారా 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రి మండలి అనుమతి ఇవ్వనుంది. చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజు కొనసాగింపునకు అనుమతి ఇవ్వనుంది. గోదావరి పుష్కరాలు – 2027కు భద్రత, బందోబస్తు, నిర్వహణ కోసం రూ.50 కోట్ల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక శాఖకు వాహనాలు, పరికరాలు, మౌలిక సదుపాయాల ఆధునీకరణకు చేపట్టిన చర్యలకు కెేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విష్ణు ఉమెన్స్ యూనివర్శిటీ, చలపతి యూనివర్శిటీలను ప్రైవేట్ యూనివర్శిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనుంది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయనుంది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-II పనుల అంచనా వ్యయం రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
‘మీభూమి - బ్లాక్‌చెయిన్’ వ్యవస్థను ప్రారంభించనున్నా సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నేడు ‘మీభూమి - బ్లాక్‌చెయిన్’ వ్యవస్థను సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భూ రికార్డుల భద్రత, పారదర్శకత లక్ష్యంగా కొత్త వ్యవస్థను సీఎం అమలు చేయనున్నారు. ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ‘మీభూమి - బ్లాక్‌చెయిన్’ సేవలు ప్రారంభించనున్నారు. భూ రికార్డుల్లో టాంపరింగ్‌కు అవకాశం లేకుండా టాంపర్ - ప్రూఫ్ సాంకేతికత వినియోగాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. భూ మోసాలను అరికట్టడం కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భూ సేవలను మరింత పారదర్శకంగా, విశ్వాసనీయంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ
తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు
ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News