అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:34 PM
అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఈరోజు (ఆదివారం) ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీ అధికారులు, వ్యవసాయ, విద్యుత్, ఇరిగేషన్, హోం శాఖ అధికారులు, హెల్త్, సివిల్ సప్లై, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరయ్యారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మందస్తు ప్రణాళికతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి..
ప్రమాద ప్రాంతాల్లో తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్ పునరుద్ధరణ అంశాల్లో సన్నద్దతపై అధికారులకు.. ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, మందస్తు ప్రణాళికతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరదతో రిజర్వాయర్లు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబరు 28వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం లోగా బాపట్ల - విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ - యానాం - కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం విస్తరించి ఉందని అన్నారు.
తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత..
అక్టోబరు 26వ తేదీన ఉదయానికి తుఫాన్‌గా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫాన్‌గా, 27వ తేదీన అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. తీరం దాటే సమయంలో గంటకు 115 -125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబరు 27వ తేదీ ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. అక్టోబరు 27, 28వ తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై గాలులు, వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు.
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు..
అక్టోబరు 27, 28 తేదీల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మిల్లీమీటర్లు, విశాఖపట్నంలో 253.87 మిల్లీమీటర్లు, శ్రీకాకుళంలో 249.18 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మిల్లీమీటర్లుగా ఉందని వెల్లడించారు. ప్రభావిత జిల్లాల్లో సగటున 22 - 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News