గాయని జానకి మృతి.. భారతీయ సంగీతానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:05 PM
ప్రముఖ గాయని జానకి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
అమరావతి, జులై 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని జానకి (Singer S Janaki) మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు.
గాయని జానకి తరతరాలను స్పృశించారు: సీఎం
‘దక్షిణ భారతదేశపు స్వర కోకిల, ప్రముఖ నేపథ్య గాయని జానకమ్మ మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నా. తెలుగు గడ్డపై పుట్టిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా సాటిలేని సంగీత వారసత్వాన్ని నిర్మించి, తన కాలాతీత స్వరంతో తరతరాలను స్పృశించారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన అపారమైన సేవ ఎప్పటికీ చిరస్మరణీయం. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి నా సంతాపం తెలియజేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జానకి మృతి పట్ల రఘురామ సంతాపం..
గాయని జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమ రాజు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తానెంతో అభిమానించే గాయని ఎస్. జానకి కొద్ది గంటల క్రితం దివి నుంచి భువికేగారని వ్యాఖ్యానించారు. వారి అమృత గానంతో ఎల్లప్పుడూ మన మదిలో జీవించే ఉంటారని స్మరించుకున్నారు. వారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తున్నానని రఘురామ పేర్కొన్నారు.
జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: మంత్రి కందుల దుర్గేశ్
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని దశాబ్దాలుగా వేలాది పాటలతో అలరించిన స్వర కోకిల గొంతు మూగబోవడం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అనేక భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియులను వారు అలరించారని గుర్తుచేసుకున్నారు. 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా' ఎస్. జానకి మృతి యావత్ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి కందుల దుర్గేశ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News