స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:38 PM
మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా స్టార్టప్‌లు, ఆవిష్కరణలదేనని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా స్టార్టప్‌లు, ఆవిష్కరణలదేనని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు పాప్‌కార్న్ సీడ్‌ను ఆవిష్కరించారు. దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనం అమల్లోకి రానుంది. ముసునూరులో పాప్‌కార్న్ మెయిజ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. తక్కువ కాలంలో విజయం సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో.. ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు.
గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరగాలి..
భవిష్యత్తులో పాప్‌కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని సీఎం చంద్రబాబు తెలిపారు. 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65శాతానికి పెరిగిందని అన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్‌కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్తే.. వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు. ఈ నెల్లోనే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. వ్యవసాయానికి ఎల్‌నినో పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇంకా 52 శాతం వర్షపాతం లోటుగా ఉందని తెలిపారు. గోదావరి, కావేరీ నదులు అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. దేశంలో నదులు అనుసంధానం కావాలని కోరుకునే వ్యక్తి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అని కొనియాడారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరగాలని ఉపరాష్ట్రపతి కోరుతున్నారని తెలిపారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాల సమస్యలు సమసిపోతాయని పేర్కొన్నారు.
ఇన్నోవేటివ్ విధానంలో ఆలోచించాలి..
దేశంలో మొదటిసారి నాన్ జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మెట్ పాప్ కార్నియా కంపెనీకి అభినందనలు తెలిపారు. సాధారణంగా ఆలోచిస్తే, మామూలుగానే జీవిస్తామని వెల్లడించారు. ప్రతి అంశం ఇన్నోవేటివ్ విధానంలో ఆలోచించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా పాప్ కార్న్ అంటేనే భవిష్యత్తులో ముసునూరు గుర్తుకు వస్తుందని చెప్పారు. దేశంలో పాప్ కార్న్ ఎగుమతులతో 185 మిలియన్ డాలర్లు ఆదా అయ్యాయని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు మనం ఉత్పత్తి చేసే పాప్ కార్న్ ఎగుమతి అయ్యేలా చూడాలని అన్నారు. కేంద్రం వ్యవసాయాన్ని జీవనోపాధిగా చూడటం లేదన్నారు. వ్యవసాయాన్ని ఆధునికీకరించి, పారిశ్రామిక విధానంలో తీసుకెళ్లాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రపంచానికి మనం పదిశాతం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. దానిని 50 శాతానికి పెంచితే ఉపాధి కలుగుతుందని, ఆదాయం పెరుగుతుందని వివరించారు.
సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకోవాలి..
ప్రతీ కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయాలనేదే తమ లక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు. రాయలసీమలో లక్ష కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టును వచ్చే డిసెంబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ఉద్ఘాటించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం వస్తే, నూజివీడు నియోజకవర్గ పరిస్థితే మారిపోతుందని చెప్పారు. మూడు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని ఈ నెలలో విడుదల చేస్తున్నామని వెల్లడించారు. సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుని, రైతులకు ఏ పంట వేయాలో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం కొత్త శకంలోకి: పవన్ కల్యాణ్
అల్పపీడన ప్రభావం.. ఏపీలో వర్షాలు
వెలిగొండ ప్రాజెక్ట్.. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తాం: మంత్రి డీజీవీ స్వామి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News