Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:50 PM
తిరుపతి జిల్లా పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను తీవ్ర శోకం మిగిల్చింది. క్షణిక ఆనందం కోసం చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.
తిరుపతి, జనవరి19 (ఆంధ్రజ్యోతి): పీలేరు నియోజకవర్గంలో గుండెలు పిండేసే విషాద ఘటన(Tirupati Incident) చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం బండవడ్డీపల్లి గ్రామంలో బీర్ల పోటీల పేరుతో అతిగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు మృతిచెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతిచెందిన ఇద్దరు యువకులు.. ఒక్కొక్కరు 19 బీర్లు తాగినట్లు పోలీసులు తెలిపారు.
బీర్ల పోటీ ఇలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండవడ్డీపల్లికి చెందిన ఆరుగురు యువకులు.. బీర్లు తాగేందుకు పోటీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో వారు ఏకంగా 19 బీర్లు తాగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో పరిమితికి మించి బీర్లు తాగడంతో ప్రాణపాయ స్థితికి చేరుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
అకస్మాత్తుగా అస్వస్థత..
బీర్లు తాగుతున్న సమయంలో యువకుల్లో ఒకడైన మణికుమార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సహచరులు అతడిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే మణికుమార్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరో యువకుడు మృతి..
ఈ ఘటనలో మరో యువకుడు పుష్పరాజ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ పుష్పరాజ్ కూడా మృతి చెందాడు. ఒకే ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది.
గ్రామంలో విషాద ఛాయలు..
బండవడ్డీపల్లి గ్రామంలో ఈ ఘటనతో శోకసంద్రం అలుముకుంది. మృతిచెందిన యువకుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామస్థులు ఈ ఘటనను తలచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల చర్యలు...
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేవీపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
యువతకు హెచ్చరికగా ఘటన
ఈ ఘటన యువతకు ఒక కఠిన హెచ్చరికగా నిలుస్తోంది. మద్యం సేవనంలో హద్దులు దాటితే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు సూచించారు. మద్యం పోటీలు, అతిగా సేవించడం ప్రాణాంతకంగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్
Read Latest AP News And Telugu News