త్వరలో ‘న్యూ డబుల్ డెక్కర్’
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:35 PM
తిరుపతి-విశాఖపట్టణం మధ్య ప్రస్తుతం నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలు స్థానంలో ‘న్యూ డబుల్ డెక్కర్’ రైలును నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి.
తిరుపతి-వైజాగ్ మధ్య నడుస్తున్న రైలు స్థానంలో ఏర్పాటు
తిరుపతి: తిరుపతి-విశాఖపట్టణం మధ్య ప్రస్తుతం నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలు 2011లో తయారైంది. దీన్ని 2012లో తిరుపతి-హైదరాబాదు మధ్య ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో కర్నూల్-హైదారాబాదు, తిరుపతి-విజయవాడ మధ్య నడిపారు. అయినా ఆదరణ అంతంత మాత్రంగా ఉండటంతో 2016డిసెంబరు 31న తిరుపతి-విశాఖపట్టణ (వైజాగ్) మధ్య నడుపుతున్నారు. ఈ రైలు తిరుపతి నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 బయల్దేరి మరుసటిరోజున ఉదయం 10.40గంటలకు వైజాగ్‌కు చేరుకుంటుంది. వైజాగ్ నుంచి సోమ, గురు, శనివారాల్లో రాత్రి 11గంటలకు బయల్దేరి మరుసటి రోజున మధ్యాహ్నం 12.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తొమ్మిది బోగీలతో నడిచే ఈ రైలులో 720మంది ప్రయాణించే సామర్థ్యముంది. కాలక్రమేణా ఈ రైలు పాతబడి, తుప్పు పట్టడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అధికమయ్యాయి. ఒక్కో బోగీ తొలగిస్తూ.. వాటి స్థానంలో సాధారణ బోగీలను ఏర్పాటుచేసి నడుపుతున్నారు. ప్రస్తుతం రెండు బోగీలు డబుల్ డెక్కర్, మిగిలిన ఏడు ఎరుపురంగులో ఉన్న ఏసీ బోగీలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ దానిస్థానంలో కొత్త బోగీలతో రైలును తయారు చేయించింది. ప్రస్తుతం ఈ రైలు.. రైల్ కోచ్ ఫ్యాక్టరీ(కపూర్తలా, పంజాబ్)లో ట్రయల్స్‌లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
P4కు కార్పొరేట్ చేయూత.. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకున్న ఐటీసీ
విమానాశ్రయాలతో ఆర్థిక ప్రగతి: జీఎంఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News