Share News

హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:12 PM

హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌(సీపీ)గా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్

హైదరాబాద్, నవంబర్ 13: నగర నూతన పోలీసు కమిషనర్‌(సీపీ)గా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని శాంతి భద్రతల అంశంపై మాట్లాడారు. ‘హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ వంటివి కీలక అంశాలు. ప్రతి ఏటా 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అందుకే ఈ అంశాలకు మేము ప్రాధాన్యమిస్తాం. మరోవైపు ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల భూ తగాదాల్లో దాడులు జరుగుతున్నాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లో అనుభవం ఉన్న అధికారులు ఎందరో ఉన్నారు. మేమందరం కలిసి టీమ్‌గా పని చేస్తాం. తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్ట్‌లు పెడతాం. పాత నేరస్థులపై నిఘా పెట్టడమే కాకుండా నేరాలు చేసిన వారికి శిక్ష పడేలా చూస్తాం’ అని సీపీ మహేష్ భగవత్ భరోసా ఇచ్చారు.


అనంతరం ఆయన గతంలో సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్, సజ్జనార్‌లను అభినందించారు. వారు ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అలాగే ప్రజల కోసం మరికొన్ని సేవలు తీసుకొస్తామని తెలిపారు. ‘డయల్ 112 రెస్పాన్స్ మరింత మెరుగుపరిచేలా పని చేస్తాం. వ్యవస్థికృత నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెడతాం. సాయంత్ర వేళల్లో నేరాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారిస్తాం. సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో కూర్చోవడం కాకుండా సాయంత్రం రోడ్‌పై డ్యూటీ చేసేలా చూస్తాం. పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. శాఖాపరమైన చర్యలూ తీసుకుంటాం. కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఉంది. దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలూ చదవండి

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్

ఏర్పాట్లలో ఎందుకింత నిర్లక్ష్యం..?

Updated Date - Nov 13 , 2026 | 01:20 PM