Share News

మిస్ యూనివర్స్‌ కొత్త కిరీటం అదుర్స్.. ఏకంగా 3,150 వజ్రాలతో..

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:49 PM

ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మిస్ యూనివర్స్ పోటీకి ఈసారి మరో ప్రత్యేక ఆకర్షణ తోడైంది. పోటీ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వాహకులు సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. వేలాది వజ్రాలతో రూపొందించిన ఈ కిరీటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మిస్ యూనివర్స్‌ కొత్త కిరీటం అదుర్స్.. ఏకంగా 3,150 వజ్రాలతో..
Miss Universe Crown 2026

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మిస్ యూనివర్స్ పోటీకి ఈసారి మరో ప్రత్యేక ఆకర్షణ తోడైంది. పోటీ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వాహకులు సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. వేలాది వజ్రాలతో రూపొందించిన ఈ కిరీటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో రూపొందించిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు. ఈ కిరీటాన్ని నవంబర్ 12న అధికారికంగా పరిచయం చేశారు. జార్జ్ విట్టెల్స్, మైసన్ డి'ఓఆర్ సంస్థలు కలిసి దీనిని రూపొందించాయి. మిస్ యూనివర్స్ 75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా ఈ ప్రత్యేక కిరీటాన్ని తీసుకొచ్చారు. ఈ పోటీల చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 12 రకాల కిరీటాలను విజేతలకు అందించారు. ప్రతి కిరీటం పోటీ ప్రయాణంలో ఒక ప్రత్యేక ఘట్టానికి గుర్తుగా నిలిచింది.


1952లో జరిగిన తొలి పోటీలో 1,529 వజ్రాలతో రూపొందించిన రోమనోవ్ ఇంపీరియల్ నప్షియల్ కిరీటాన్ని విజేతకు అందించారు. ఆ తర్వాత కాలానుగుణంగా డిజైన్, విలువైన రాళ్లు, కళాత్మకతలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన కొత్త కిరీటం 13వ డిజైన్‌గా నిలవనుంది.

ఇక మిస్ యూనివర్స్ 2026 పోటీలో 121 దేశాలకు చెందిన అందాల భామలు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. నవంబర్ 24న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. భారత్ తరఫున కేరళకు చెందిన కజియా లిజ్ మెజో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈ కొత్త కిరీటం కేవలం అందానికి ప్రతీక మాత్రమే కాదు. మిస్ యూనివర్స్ 75 ఏళ్ల చరిత్ర, వారసత్వం, వైభవానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.


12 విభిన్న డిజైన్ల కిరీటాలు, విజేతలు..

  • 1952: రోమనోవ్ ఇంపీరియల్ కిరీటం- ఫిన్లాండ్‌కు చెందిన ఆర్మీ కుసేలా విజేత

  • 1953: క్రిస్టియన్ మార్టెల్ కిరీటం- ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టియన్ మార్టెల్

  • 1954-1960: స్టార్ ఆఫ్ ది యూనివర్స్- అమెరికాకు చెందిన మిరియం స్టీవెన్సన్ సహా ఏడుగురు విజేతలు

  • 1961-1962: రైన్‌స్టోన్ కిరీటం- మార్లీన్ ష్మిత్, నార్మా నోలన్

  • 1963-2001: కోవెంట్రీ కిరీటం- బ్రెజిల్‌కు చెందిన ఐడా వర్గాస్ నుంచి ప్యూర్టో రికోకు చెందిన డెనిస్ క్వినోన్స్ వరకు

  • 2002-2008, 2017-2018: మికిమోటో ఫీనిక్స్ కిరీటం- ఆక్సానా ఫ్యోడొరోవా, కాట్రియోనా గ్రే తదితర విజేతలు

  • 2008: కావో కిరీటం- వెనిజులాకు చెందిన దయానా మెన్డోజా

  • 2009-2013: డైమండ్ నెక్సస్ పీస్ కిరీటం- లీలా లోప్స్ సహా ఐదుగురు విజేతలు

  • 2014-2016: డీఐసీ కిరీటం- పౌలినా వేగా, పియా వుర్ట్జ్‌బాచ్, ఐరిస్ మిట్టెనెరే

  • 2019- 2021: మౌవాడ్ పవర్ ఆఫ్ యూనిటీ- జోజిబిని టుంజీ, ఆండ్రియా మెజా, హర్నాజ్ సంధు

  • 2022-2023: మౌవాడ్ ఫోర్స్ ఫర్ గుడ్- ఆర్‌బోనీ గాబ్రియేల్, షెయినిస్ పలాసియోస్ విజేతలు

  • 2024-2025: జ్యువెల్మర్ లూమియర్ డి ఎల్ ఇన్ఫిని- విక్టోరియా కెజెర్ థెయిల్విగ్, ఫాతిమా బోష్


ఈ వార్తలు కూడా చదవండి

మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. నిలిచిపోయిన ఔట్‌లుక్, టీమ్స్..

'నేనొక పనికిరాని వెధవను'.. తనను తాను తిట్టుకున్న జెన్సన్ హువాంగ్..

Updated Date - Nov 13 , 2026 | 12:55 PM