Share News

మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. నిలిచిపోయిన ఔట్‌లుక్, టీమ్స్..

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:38 AM

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగిస్తున్న లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ ఈ-మెయిల్ సేవ ఔట్‌లుక్‌తో పాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ వంటి సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. గురువారం ప్రారంభమైన ఈ సమస్య శుక్రవారం కూడా కొనసాగుతోంది.

మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. నిలిచిపోయిన ఔట్‌లుక్, టీమ్స్..
Microsoft Outlook

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగిస్తున్న లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ ఈ-మెయిల్ సేవ ఔట్‌లుక్‌తో పాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ వంటి సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. గురువారం ప్రారంభమైన ఈ సమస్య శుక్రవారం కూడా కొనసాగుతోంది. దీంతో వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించినప్పటికీ, అన్ని సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.


యూజర్లకు ఇబ్బందులు..

అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఔట్‌లుక్ సేవల్లో సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయని అవుటేజ్‌ను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశలో దాదాపు 1.30 లక్షల మంది యూజర్లు ఔట్‌లుక్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఇన్‌బాక్స్‌ను తెరవడంలో సమస్యలు ఎదురయ్యాయి. అలాగే, ఔట్‌లుక్‌తో పాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లోనూ అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కార్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన ఈ సేవలు ప్రభావితం కావడంతో పలు సంస్థల్లో పనులు మందగించాయి.


అసలు సమస్య ఎక్కడ వచ్చింది?

మైక్రోసాఫ్ట్‌కు చెందిన కొన్ని సర్వర్లు అకస్మాత్తుగా పని చేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్లు ఆటోమేటెడ్ హెల్త్ చెక్‌లలో విఫలం కావడంతో అందుబాటులో ఉన్న మిగతా సర్వర్లపై పనిభారం పెరిగింది. దీంతో అవి కూడా అధిక ఒత్తిడికి గురై కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఔట్‌లుక్, టీమ్స్, వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, వన్‌డ్రైవ్ సహా మైక్రోసాఫ్ట్ 365 సేవలు నిలిచిపోయాయి. ఇది వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం వల్ల జరిగిన సమస్య కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇటీవల చేసిన కొన్ని కాన్ఫిగరేషన్ మార్పులూ సమస్యకు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రభావిత సర్వర్లను పునరుద్ధరణకు తొలుత చేపట్టిన పరిష్కార చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని వెల్లడించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.


ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

ఔట్‌లుక్ సేవలను పునరుద్ధరించేందుకు మైక్రోసాఫ్ట్ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని సేవల్లో మెరుగుదల కనిపించినప్పటికీ, అన్ని ప్రాంతాల్లో సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు సంస్థ ప్రకటించలేదు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు సంబంధించి నిర్దిష్ట సమయాన్నీ వెల్లడించలేదు. దీంతో ఔట్‌లుక్, ఇతర మైక్రోసాఫ్ట్ సేవలపై ఆధారపడే యూజర్లు అధికారిక అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!

చిన్నారిని భూమిలో పాతిపెట్టిన తండ్రి.. ఒక రోజు తరువాత సజీవంగా..

Updated Date - Nov 13 , 2026 | 11:11 AM