Share News

స్థానిక ఎన్నికలు.. ఓటు వేసేందుకు 22 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి: మున్సిపల్ కమిషనర్

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:55 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైందని తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ స్పష్టం చేశారు. రేపు (ఆదివారం) జరగనున్న ఎన్నికల పోలింగ్‌ల్లో ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ సూచించిన 22 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా అనుమతి ఉంటుందని వివరించారు.

స్థానిక ఎన్నికలు..  ఓటు వేసేందుకు 22 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి: మున్సిపల్ కమిషనర్
Andhra Pradesh Municipal Elections,

తిరుపతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైందని తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ స్పష్టం చేశారు. రేపు (ఆదివారం) జరగనున్న ఎన్నికల పోలింగ్‌ల్లో ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ సూచించిన 22 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా అనుమతి ఉంటుందని వివరించారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా గుర్తింపు కార్డుతో నిర్భయంగా ఓటు వేయొచ్చని సూచించారు. ఈరోజు (శనివారం) తిరుపతిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో జయకృష్ణ మాట్లాడారు. ఓటర్ స్లిప్పు అనేది కేవలం ఓటర్ల సౌకర్యార్థం అందించే అదనపు సదుపాయం మాత్రమేనని తెలిపారు. నగరంలో ఏఎస్‌డీటీ (ASDT) జాబితా మినహా మిగిలిన ఓటర్లలో 95 శాతానికి పైగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని వెల్లడించారు. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) వల్లే కొన్నిచోట్ల ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లోకి మారినట్లు వివరణ ఇచ్చారు.


ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు..

ఓటు వివరాలు, పోలింగ్ కేంద్రం సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చని జయకృష్ణ సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సహాయార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 304 పోలింగ్ కేంద్రాల్లో 2 వేలకు పైగా పోలింగ్ సిబ్బంది, 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, షామియానాలు, కుర్చీల వంటి కనీస వసతులు కల్పించామని జయకృష్ణ పేర్కొన్నారు.


ఎన్టీఆర్ జిల్లాలో..

ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 28 వార్డులకు గాను 40 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి పోలింగ్ మెటీరియల్‌ను ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల అధికారులు తరలించారు. తిరువూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర మెటీరియల్‌ను పోలింగ్ సిబ్బందికి.. అధికారులు అందజేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ ఆయా కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది తరలి వెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 180 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


తిరువూరు సబ్ - డివిజన్ పరిధిలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ, ఐదుగురు సీఐలు 12 మంది ఎస్ఐలు, 7 మొబైల్ పార్టీలు, పెట్రోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద 180 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరువూరు పురపాలక సంఘంలో మొత్తం వార్డులు - 28 ఉండగా, ఓటర్లు - 28,357 ఉన్నారు. వారిలో పురుషులు- 13598, స్త్రీలు -14756, మిగతవారు - 03 ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు -40 ఉన్నాయి. ఛైర్మన్ బరిలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు. వార్డు కౌన్సిలర్‌ల పోటీలో 28 వార్డులకు 79 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 06:39 PM